Monday, April 16, 2018

రాలినపూలు...


రేయంతా రెక్కలు విప్పుకుంటూ
ఉదయాలకి ఊపిరద్దుతావు
సొబగులద్ది కొమ్మకు అందాన్ని ఆపాదిస్తూ
ఆహ్లదం , పరిమళంతో ఉదయాన్నే విచ్చుకుంటూ
భానుడికి స్వాగతం పలికాక
ఏ దేవుని పాదల క్రిందనో పూజా పుష్పంగానో
మాలలో ఇమిడిపోయి ఆ భగవంవంతుని హృదయంపైనో
అలంకారమై పూజలందుకుంటావో
వికసించిన జన్మను సార్దకం చేసుకుంటావు
ఒక్కరోజు ఆయుస్సు నీదైనా
ఎందరి జీవితాల్లో సందడీ చేస్తావో
శుభానికో అశుభానికో
ఆహ్వానానికీ వీడ్కోలుకీ
పెళ్ళి పేరంటానికీ
రంగులమయమైన ప్రకృతిలో
నువ్వో అద్భుతమైన ఆనందానివి
రాలుతూ మరో పువ్వునూ స్వాగతిస్తావు
వడలుతూ మరో సుమ పరిమళానికి వన్నె తెస్తావు
ఎన్ని జీవన యాత్రలకో నువ్వో ఆదర్శానివి
వేదనతో వేలాడే బ్రతుకులకు నువ్వో ప్రతిబింబానివి
జన్మను పరిమళిస్తూనే ముగించమంటావు
రేపటికి కొత్త సొయగాలద్దుకుంటూ సాగిపొమ్మంటావు
రాలిపోయిన క్షణాలన్నీ
వేకువలో జ్ఞాపకాల పుష్పాలై పలుకరిస్తూనే వుంటాయి
అందమైన చిరునవ్వులా
చీకటిని చెరిపేసే కాంతి సుగంధాన్ని పంచే సృష్టి రహస్యం పువ్వు ...!!
.........వాణి కొరటమద్ది

No comments:

Post a Comment