Thursday, April 19, 2018


చీకటెపుడూ నిత్యమేనని - రోజులెపుడూ చెప్పలేవూ ||
నలుపుతెరలను చెరపలేమని - కాంతులెపుడూ చెప్పలేవూ ||

ఆరిపోవీ నీటిచుక్కలు - గుండెగాయపు ఆనవాళ్ళవి
వేదనే ఒక భావమంటు - ఊహలెపుడూ చెప్పలేవూ ||

మనసులేమిని ఓపలేమని - కనులు చెప్పెను భాష్పమొలుకుతు
మధురదృశ్యం మరుగుకమ్మని - చూపులెపుడూ చెప్పలేవూ ||

కంటి ఇంటిలొ కలల ముచ్చట - వెలుగుతున్నవి కాంక్షలెన్నో
గాఢనిద్రలొ సందడేమిటొ- ఆశలెపుడూ చెప్పలేవూ ||

పండువెన్నెల నిండుకుండగ - పలుకరించెను ప్రేమస్పర్శతొ
మబ్బుతరగను అడ్డురమ్మని - తలపులెపుడూ చెప్పలేవూ ||

అంతులేనిది ఆత్మపయనం - అలసిపోదది అంతరంగం
హృదయలోతుల సంగతేమిటొ - పలుకులెపుడూ చెప్పలేవూ ||

ఎండమావులు ఎడదగదులు - చెరిగిపోవేం చేదుమరకలు
వేదనల్లో వెంటరామని - మమతలెపుడూ చెప్పలేవూ ||
......వాణి, 

No comments:

Post a Comment