Thursday, April 19, 2018

నా ప్రియమైన నీకు ...
నీ సునితమనస్సు వెల్లడించే భావాలు నన్ను మరోలోకంలోకి తీసుకెళ్ళిపోతున్నాయి. నీ లేఖల్లో దాగుండిన నేను నీ హృదయ సామ్రాజ్యంలో విహరిస్తూ నన్ను నేను మరిచి మౌనమై ఓ కొత్త ప్రపంచంలో మనదైన వెన్నెలలో సంచరిస్తుంటాను..
సంభాషించాల్సిన భావాలన్నీ మౌనక్షణాలు లెక్కించు కుంటున్నాయి. ఎదురుచూపుల భారాన్ని నేను మాత్రం మోయటం లేదా చెప్పు. ఊహల ఊసులు కలల కావ్యాలు మనసులోనే రచించుకుంటున్నాము కదా... పలుకరింతల్లో ప్రేమను స్పర్శించలేక...దూరమైన మాటల్లొ నిరాశ దాగుడుమూతలు ఆడుతున్నా ..మాటల్ని ఓడిపొతూ మౌనాన్ని హత్తుకుంటూనే ఉంటాను..
ఏదో చెప్పాలని ఆశ.. గుండెల్లో దాచుకున్న భావాలన్నీ నీ మనసులో కుమ్మరించాలని ఆరాటం... అలసిపొతున్నా కానీ,.. అంతరంగంతో యుద్ధం అనివార్య మౌతోంది .
నిశ్శబ్ద బందీలో.. నీ ఊహల ఊసులలో కాలం కరిగిపోతోంది , కనిపించని లోకమేదో కలలో కదిలిపోతోంది ...నీ జతలో నేను ఇంకి పొతూనే ఉన్నా నేనేమిటో అర్ధం కాక.
చూశావా...
భారమైన దూరాల మధ్య బందీలుగా మిగిలిపోయాం. అవసరాల జీవితంలో ఖైదీలుగా సాగిపొతున్నాం .మన ప్రమేయం లేని ఎడబాటు కాలం మౌన సందేశమై కరిగిపోతోంది సమయం .
తనువుల దూరాన్ని తలచుకుంటూ స్పర్శల సాంగత్యం కావాలని మనసుల పెనవేసుకున్న మౌనమే మాటాడు కుంటొంది.జ్ఞాపకాల పుటలు విప్పుకుంటూ...అనుభూతుల అందాలు పంచుకుంటూ ..మనుగడకై పోరాటంలో జీవనయానం తప్పనిసరి.
దూరాన్ని నిందిస్తూనే వున్నా...దగ్గరను దాసోహం కమ్మంటూ...
నిరీక్షణకు నిట్టూర్పుల కానుకిస్తూనే వున్నా. ఎదురు చూపుకు కన్నీళ్ళను బహుమతినిస్తూ.....
వచ్చి వెళ్ళి పొతావు హడావిడిగానే... ఉన్న కాసింత సమయంలోనే మమతల సంతకాలు నింపేసుకుని. రాబోయే క్షణాలకు తాయిలాలు దాచేసుకుని నిశ్శబ్ద ప్రయాణం నాదౌతుంది. మళ్ళీ మామూలే దూరాన్ని మోసుకుంటూ దగ్గరకై వేచి చూస్తూ ...
నిత్యమైన ఎదురుచూపుల్లో ...
అంతులేని అగాధాలెన్నో
అద్దాన్నికూడా ఏమార్చు కుంటోంది మనసు నీ కోసమే ...
నీ కనుపాపల్లో అర్థాలు ఆస్వాదించు కోవాలని ఆరాటపడుతూ
కాలాన్ని కసురుతూనే ఉన్నా లోకం మనదై కరిగిపోవాలని.
రెప్పలు కలవని రాత్రులే అన్నీ
వలపు సంతకాలతో నిండిన మాధుర్యపు జ్ఞాపకాలు లెక్కించు కుంటూ...
రేపటికి ఊతమవ్వాలని నీ ధ్యాసలోనే నన్ను నేను నడిపించుకుంటున్నా మన ఆశల వారధి కోసమే
అక్షరాల్లొ ప్రస్ఫుటించే ఆంతర్యాలెన్నో కదూ నువ్వై నాలో కరిగిపోతూ నెనై నీలో ఇమిడిపొతూ ...
ఎంతైనా అందంగా వుంది సుమా నీ లేఖ నన్నే నీ దగ్గరగా చూసుకుంటున్నట్లుగా నేనున్నట్లుగా.అక్షరాలు చేసే అద్భుతాలు కదూ. మనంగా ప్రకటించుకునే ఆనందాలు కదూ..
మనసామ్రాజ్యాన్ని నిర్మించుకుని మనమై కలసిపొదాం ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకుంటూ .అంతవరకు
ఇలా కాసిన్ని వాక్యాలు నీ కోసం ప్రేమికుల రోజున అక్షరమై స్పర్శించుకుంటూ...
నీ... నేను

No comments:

Post a Comment