Thursday, April 19, 2018

వెన్నెలయే వేదనలను వలచినట్లు ఉందేమిటి ||
నిన్నలతో నిశలన్నీ కరిగినట్లు ఉందేమిటి ||

మధురమైన మౌనమేదొ మదిని ముంచివేస్తోంది
మనసంతా అందియలే మ్రోగినట్లు ఉందేమిటి ||

బాటంతా చెమరించిన చుక్కలెన్ని కురిశాయో
చూపులపై చిరునవ్వులు చిలికినట్లు ఉందేమిటి ||

నిట్టూర్పులు నిధులైతే నిరసనెంత తెలిపానో
చిత్రంగా నవ్వుపూలు రాలినట్లు ఉందేమిటి ||

కుములుతున్న కంటిపాప మమతస్పర్శ కోరింది
ఊహించని ప్రేమజల్లు తడిపినట్లు ఉందేమిటి ||

వడలుతున్న తరులతయే వానచినుకు అడిగింది
ప్రియముగానె హిమవర్షం కురిసినట్లు ఉందేమిటి ||

మౌనవాణి జ్ఞాపకాల వనములోన విహరిస్తే
మరందాల కొలనులోన ఈదినట్లు ఉందేమిటి ||
........ వాణి ,

No comments:

Post a Comment