Thursday, April 19, 2018

కాంతివిలువ తెలిసేందుకు మెరుపొక్కటి చాలదా ||
కన్నీళ్ళను తుడిచెెందుకు మమతొక్కటి చాలదా ||
.
చెరిగిపోయి రంగులకల ముడివేసిన నవ్వులతెర
ఆశయాలు గెలిచేందుకు ఆశొక్కటి చాలదా ||
.

మూసుకున్న చూపులలో వేలాడే ఊహలెన్నొ
వెన్నెలలే నింపేందుకు స్పర్శొక్కటి చాలదా ||
.
నిస్సహాయ క్షణాలెన్నొ మౌనాలే ఓదార్చుతు
కన్నీటికి నిందెందుకు విలువొక్కటి చాలదా ||
.
చీకటులే చుట్టుకుని ఆలోచన చుట్టుముట్టి
చిక్కుముడులు విప్పేందుకు తోడొక్కటి చాలదా ||
.
మౌనవాణి మనసుచెప్పు అందమైన ఆవేదన
మౌనాలను చీల్చెందుకు మాటొక్కటి చాలదా ||
.
విషాదాలు రాల్చుకున్నచుక్కలెన్నొ చెక్కిలిపై
ఆవేదన మరిచెందుకు ప్రేమొక్కటి చాలదా ||
.
రాలిపోయి పువ్వులెన్నొ గాయపడ్డ గుండెలెన్నొ
చిరునవ్వులు పంచెందుకు మనసొక్కటి చాలదా ||
.
యాంత్రికమే జీవితాలు నటనగానె ఆప్యాయత
అపార్ధాలు తొలగెందుకు పలుకొక్కటి చాలదా ||
.........వాణి,

1 comment:


  1. // రాలిపోయి పువ్వులెన్నొ గాయపడ్డ గుండెలెన్నొ
    చిరునవ్వులు పంచెందుకు మనసొక్కటి చాలదా //
    చాలా రోజులనుంచి మీ బ్లాగ్ ద్వారా నా అభిప్రాయాలు పంచుకోవాలనుకున్నా..అయితే భావాతీతమైన స్థితిలో ఉన్నపుడే బ్లాగులను తీరికగా చదువుతా..నిజానికి నేను బ్లాగుకే అత్యంతప్రాధాన్యత ఇస్తాను...నావద్ద నేనిష్టపడే మిస్టికల్ రచనలు, తాత్వికచింతన , మెలంకలీలు రాసే బ్లాగర్స్ కనీసం 20 మంది ఉన్నారు..వారితో నేను 20 సం నుంచి సంభాషిస్తూనే ఉన్నా..కాకపోతే నా బ్లాగర్స్ అందరూ ఆంగ్ల సాహితీకారులే...వీరిలో మనదేశానికి చెందినవారు షుమారు 15 గురు ఉన్నారు...ఇపుడు ఆ జాబితాలో మీరూ చేరిపోయారు..
    ఇక సబ్జెక్ట్ లోకి వస్తే రాలిపొయ్యే పువ్వులు..గాయపడ్డ గుండెలు ఇవి అనేకం ఉంటాయి...అయితే ఇంతటి విషాదం లోకూడా చిరునవ్వులు పంచగలిగే మనసొక్కటి ఉంటేచాలు..మీ కవితలు, గజల్లు చదువుతుంటే మా అమ్మ గుర్తుకు వస్తూంటుంది..
    మా అమ్మకున్న ముగ్గురి సంతానం లో విధివశాత్తు ఒక కుసుమం నక్షత్రమై నింగికి చేరుకుంది..
    అంతే వెలుగు నీడల జీవితం లో మా అమ్మతో పాటు నాకు ఊహతెలిసినప్పటినుంచే వైరాగ్యము, ఆత్మ విచారణ పై దృష్టిమళ్ళింది..
    ఈ నిరంతర విచారణలో నేను చూసిన సత్యాలెన్నో!!!ఆత్మానాత్మ వివేకం లో నేను తెలుసుకున్న విషయాలెన్నో!! జీవుడియొక్క అస్తిత్వము...పునర్జన్మ సిద్ధాంతం కోసం మా అమ్మపడిన వేదన, తాపత్రయము ఎంతో!!! ఈ చిక్కుముడులకు కొడుకుగా మా అమ్మకు నేను ఎంతో సమాధానం కలిగించాను..
    ఎన్నిచెప్పినా...మనసు..భావన...ఆత్మ ఇవి విడదీయరానివి సుఖం లో ఉన్నపుడు దుఃఖం లో ఉన్నపుడు..అయితే ఒక భావాతీతమైన స్థితిలో వీటిని వేరు చేసి ఆత్మస్వరూపాన్ని మాత్రమే చూడగలిగితే అందులోనే ఈ సమస్త విశ్వం ఇమిడిఉందన్న నిజం మనకు సాక్షాత్కరిస్తుంది..
    ఇది నేను పొందిన అనుభూతి..ఈ అనుభూతి తేలికా కాదు..కష్టము అంతకంటేకాదు..
    సాధనలో ..ఒక నిరంతర ఏకాగ్రతలో ఈ పరమసత్యాన్ని వీక్షించవచ్చు!!!!!!
    వీలు వెంబడి మీ బ్లాగులో నా అభిప్రాయాలు పంచుకుంటూనే ఉంటాను వాణిగారు..Continue this blog....Wishing you all the best...Rama Subba Rao.B.








    .








    .

    ReplyDelete