Monday, April 16, 2018



నిశీధిలో వెన్నెలనై నిలవాలని ఉన్నదిలే ||
చీకటినే చిరునవ్వుతొ చెరపాలని ఉన్నదిలే ||

ఆకాశం అందలేదు ఆ అవతల ఏముందో
అంబరాన్ని సంబరంగ చుట్టాలని ఉన్నదిలే ||

మౌనమైన బాధ నాది మధురంగా చెపుతున్నా
భారాలను భావాలలో నింపాలని ఉన్నదిలే ||

సముద్రాన్ని చూస్తున్నా అలలతోన ముచ్చటిస్తు
కెరటాలకు చిరునామా వెతకాలని ఉన్నదిలే ||

అనుభవాలు ఎన్నెన్నో రాలిపడిన నిన్నల్లో
అనుభూతులు అద్దంలో చూడాలని ఉన్నదిలే ||

ఏమారిన కాలాలను నెమర వేసుకుంటున్నా
జ్ఞాపకాల అందాలను అందాలని ఉన్నదిలే ||

మట్టిదేగ మమకారం మరుజన్మను నిర్మిస్తూ
తుదిదాకా అనురాగం పంచాలని ఉన్నదిలే ||

ఆత్మీయత మోహమాటపు రంగు పులుము కుంటోంది
మమతతోనే బంధాలను నెగ్గాలని ఉన్నదిలే ||

శిశిరాలను వసంతాల శోభలతో నింపాలీ
కాలానికి సౌరభాలు అద్దాలని ఉన్నదిలే ||

ఆత్మలోని ఆంతర్యం అంతులేని వ్యవహారం
మౌనవాణి దుఃఖాలను చెరపాలని ఉన్నదిలే ||

కలుషితమే ప్రేమలన్ని మనషితనం మరుగౌతూ
గతమైనది ఆనందం చేదాలని ఉన్నదిలే ||

చేరలేని దూరమది బరువైనది గమ్యమేమో
మమకారపు సంకెళ్ళను వీడాలని ఉన్నదిలే ||

గమ్యాలకు చేరువైన గాథలెన్నో చూస్తున్నా
అరుదైనవి కథలెన్నో చెప్పాలని ఉన్నదిలే ||
......వాణి

No comments:

Post a Comment