Monday, April 16, 2018

పరిగెట్టే హాసాలకు గాలమెవరు వేస్తారూ ||
సలుపుతున్న వేదనలకు సంకెలెవరు వేస్తారూ ॥

ఇంకిపోయి కునుకంతా తిమిరంలో తచ్చాడెను
పీడించే రాత్రములకు పానుపెవరు వేస్తారూ॥

కరుగుతున్న క్షణాలన్ని కలవరాలు ప్రకటిస్తే
జ్ఞాపకాల ప్రతిమలకు ముసుగులెవరు వేస్తారూ ॥

గతమైనా కాలమంత గుండె నొదలి పోలేదు
ఆగిపోని అశ్రువులకు తాళమెవరు వేస్తారూ॥

తపనపడ్డ ఆశలెన్నొ దు:ఖాలను మింగాయి
నలుగుతున్న స్వప్నాలకు రంగులెవరు వేస్తారూ॥

తడిమనసుతొ తల్లడిల్లి నా వాణీ మూగబోయె
గండిపడ్డ కన్నులకు వంతెనెవరు వేస్తారూ॥
........వాణి

No comments:

Post a Comment