Monday, April 16, 2018

మనసంతా నీ రూపే తలుస్తోంది ఎందుకనీ ||
మాధుర్యపు భావనతో నిండుతోంది ఎందుకనీ ||

తడియారని కురులతోన చిరుగాలుల ముచ్చట్లూ
చూపుతాకి చిరునగవే మురుస్తోంది ఎందుకనీ ||

ఎదురుచూపు అలసటలో నిట్టూర్పులు భారమాయె
దూరాలను కనుపాపే వెతుకుతోంది ఎందుకనీ ||

పొద్దువాలి పోతున్నది రేయి పలుకరిస్తున్నది
ఎదలోతున ఆరాటం తడుముతోంది ఎందుకనీ ||

అందమైన ఆశలతో రెప్ప వాలి పోతున్నది
హృదయభాష వెన్నెలకే తెలుపుతోంది ఎందుకనీ ||

వడలుతున్న ఊహలలో ఉనికి మరచి పోతున్నా
మధురవాణి గుండెల్లో మిగులుతోంది ఎందుకనీ ||

......వాణి

No comments:

Post a Comment