Monday, April 16, 2018

సర్దుకుపోతూ ....
చిరునవ్వులు పెదాలపై పూయించాలని
చిరకాల చీకటిని చెరిపేయాలని
కొత్త కాంతులు కూడగట్టు కుందామని
మధురవర్ణాలలో మురిసిపోదామని
ఉగాదికై ఎదురుచూస్తున్నా..

సందడి చేసిన సందర్భాలన్నీ ఙ్ఞాపకాలేనా
నాటిలోనే మిగిలిన ఆనందాలు
బ్రతుకుయుద్ధంలో బందీ అవడం
నేడు నిజమేనేమో
ఊపిరికై పోరాటాలు
ఉనికి వెతుక్కునే ఆరాటాలు
కలల నావను నిర్మించడంలోనే
కడతేరి పోతోంది కాలం
వెన్నెల యాత్రకు ఎపుడు సన్నద్ధం కావాలి
క్షణాల నిరీక్షణలన్నీ
కలతను కడిగేయడంలోనే నిమగ్నమయ్యాక
కొత్త ఆశలకు చిగురులెపుడు తొడగను
ఆమనిని అడుగుతూనే వున్నా
కాసిన్ని ఆనందాలు కుమ్మరించి పొమ్మని
కోయిలమ్మా కాస్త కనిపించవమ్మా
కలవరాన్ని మరిచి కూనిరాగం తీస్తానంటూ బ్రతిమాలుతూనేవున్నా
ఉరకలు వేసిన ఉగాది
ఊహగానే పలుకరిస్తోంది
వసంతాలు వికసించాయని
ఋతువులు మారిన
ఋజువులేమీ కనిపించడం లేదు
అరుదుగా కనిపించే పచ్చదనం
ఊరవతల కెళ్ళి చూసొస్తున్నా
ఉగాది పచ్చడికై రూకలు చెల్లించి
రుచులు కొనుక్కుంటూ
షడ్రుచులను చేదుగానే ఆస్వాదిస్తున్నా
అనుబంధాలను అందమైన సందేశాలలో స్పర్శించుకుంటూ
సంగతులన్నీ మౌనంగా మింగేస్తున్నా
కొత్తగా ప్రకటించే వ్యాపార సంస్ధల ప్రతిపాదనలకై
వెతుక్కుంటూ
తన చిల్లర డబ్బులే రాబందులై ఎగరేసుకుపోతున్నా
గమనించలేని నిస్సహాయతలో
సాగిపోతోంది
సామాన్యుల ఉగాది
కాలం కదులుతూనే వుంది
అందుకే ఉగాది వచ్చింది
నిన్న ఙ్ఞాపమనుకున్నాక
రేపటికై ఎదురుచూపు తప్పడంలేదు
ఈసారి కూడా సాగిపోవాల్సిందే నా ఉగాది
సంతోషాలను సర్దుకుపోతూ...
......వాణి ,

No comments:

Post a Comment