Monday, April 16, 2018

ఊహలన్నీ వీగిపోతే - ఆశయాలే చెదిరి పోవును ||
గాయ మేఘం కమ్ముకుంటే - కలవరాలే మిగిలి పోవును ||
మనసు కురిసే మమతవర్షం - మౌనమైనది తెలియలేదు
రెప్పమూయని దుఃఖమైతే - ఙ్ఞాపకాలే అలసి పోవును ||
అంతరంగము చిత్రమైనది - పయనమాపదు విశ్రమించదు
నిదుర మరచిన శూన్యమైతే - సంకటాలే నిలిచి పోవును ||
గుండె గూటికి పండుగెప్పుడు - గురుతులన్నీ శోకమైతే
నవ్వులన్నీ నటనలైతే - విషాదాలే నలిగి పోవును ||
అలల కెంతటి తపననోకదా - తీరమంతా తడుముకుంటూ
అలుపు లేనిది సాధనైతే - ప్రయత్నాలే గెలిచి పోవును ||
బ్రతుకు చిత్రం నీదె అయినా - విధాతవేలే విచిత్రాలు
ఆశ అన్నది చెరప లేనిది - సంశయాలే వెలిగి పోవును ||
కలల నావను కదపలేనులె - మౌనవాణిది జాగరూకత
నిశల బాటలొ పరుగులైతే - సంతసాలే విరిగి పోవును ||
....వాణి,

No comments:

Post a Comment