Monday, April 16, 2018

తప్పిపోయి నీ జాడలు వెతుకుతూనె ఉన్నాను ||
ఎదురుచూపు కన్నీళ్ళను చల్లుతూనె ఉన్నాను ||

కంటిమీద గుండెబాధ చెరపలేని గాయమై
జ్ఞాపకాల మరకలన్ని తడుముతూనె ఉన్నాను ||

మదిలోతుల అలజడులే రెప్పలపై చప్పుడులె
చీకటిలో అక్షరాలు చెక్కుతూనె ఉన్నాను ||

మౌనమంత కవనమౌతు వికసించే కెరటమై
తడుపుతున్న కాగితాన్ని నిమురుతూనె ఉన్నాను ||

కనులకడలి పొంగుతూ కాంతి గీతి పాడనా
మదిఘోషకి మరపుమందు పులుముతూనె ఉన్నాను ||

చెమరించే మువ్వలన్ని చెక్కిలిపై చిట్లిపడ
చెంపలపై చారికలను చెరుపుతూనె ఉన్నాను ||

గుండెల్లో దిగులుముళ్ళు గుచ్చుతున్న ఆనవాళ్ళు
మౌనంతో అనునయాలు అద్దుతూనె ఉన్నాను ||

కవిత్వమే ప్రియమవుతు అక్షరమై ప్రవహిస్తు
భావంలో మాలికగా ఒదుగుతూనె ఉన్నాను ||

విసుక్కునే హృదయంతొ ఒంటరైన చూపులలొ
నటియించే నవ్వులనే తొడుగుతూనె ఉన్నాను ||

........వాణి,

No comments:

Post a Comment