Monday, April 16, 2018



వెలుగు పూల వర్షంలో - తడవాలని అనుకున్నా ||
కనుపాపకు కాంతులనె - తొడగాలని అనుకున్నా ||

నిశీధులో నిట్టూర్పులొ- ఏమైనా ఎదురైనా
అడుగులన్ని వెలుతురులో- సాగాలని అనుకున్నా ||

అంతులేని ఆకాశపు - వీధులలో విహరిస్తూ
వెన్నెలగా నేనంతా - మెరవాలని అనుకున్నా ||

నలుపైతే నేమైనది కనులలోన అందాన్నే
రెప్పలపై కాటుకగా కరగాలని అనుకున్నా ||

దిశలన్నీ తారాడితి - నీ ఉనికే తెలియలేదు
వేలుపునే వేదనగా - వేడాలని అనుకున్నా ||

ధ్యాసంతా నీపైననే - జరపలేను కాలాన్నీ
దుఃఖానికి పరదాలను - కప్పాలని అనుకున్నా ||

మౌనవాణి మానసమే - అంతులేని కలవరమే
కన్నీళ్ళను కావ్యంగా - మలచాలని అనుకున్నా ||

స్వర్గంలో నీ వుంటే - అందలేని ఆరాటం
కరిగిపోని కలలాగా - మిగలాలని అనుకున్నా ||

.......వాణి,

No comments:

Post a Comment