Thursday, April 19, 2018

...దేశానికి చిరునవ్వులం...



దేశం వాకిట నిలచిన చిరునవ్వులం
భావి భారతానికి పునాది రాళ్ళం
కడుపు నిండకున్నా కవాతు చేస్తాం
కన్నీళ్ళు తుడవకున్నా దేశానికి జే కొడతాం

పుట్టినగడ్డకి నిత్యం ప్రణమిల్లుతూనేవుంటాం
మా మట్టిని మేము ముద్దాడుతూనే వుంటాం
దేశం మాకేమివ్వలేదనలేదులే నేస్తం
ఏలికల స్వార్ధానికి సమిధలమౌతూనే వుంటాం
అలమటించే ఆకలి ఆశను
అదుముకుంటునే వున్నాం
మా కన్నీళ్ళతో దేశమాతను అభిషేకిస్తూనే వున్నాం
నటించే నేతకు వినిపించవు ఆర్తనాదాలు
కనిపించవు వారి వాహన చక్రాలకంటిన నెత్తుటి మరకలు
నగుబాటుగానే మిగిలిన దృశ్యాలం
చీకటి చరిత్రగా మిగిలిన సాక్ష్యాలం
అయినా జాతీయజెండా మా ప్రాణం
జై హింద్ అంటూనే ఊపిరి ఉనికిని చాటుతాం
బ్రతుకుకు బాసటనిస్తే బ్రహ్మాండాలు సృష్టిస్తాం...!!
...వాణి,

No comments:

Post a Comment