Monday, April 16, 2018

.......చీకటిలో చెమటచుక్క ఆమె.....


అలసిన రాత్రి ఆదమరచిన వేళ
తను మెలుకువై రహదారిని హత్తుకుంటుంది

పగలంతా స్వచ్ఛ భారతమంటూ పతాకాలు చేతబూని వాగ్దానాలు ముగిసిపోయాక
స్వచ్ఛతకు శ్రీకారం చుడుతూ చెమట చుక్కలతో వీధులన్నీ శుద్ది చేస్తుంది
నొప్పిపడే అవయవాలను మోసుకుంటూ అర్ధరాత్రి
రోడ్లపై రెక్కలకు చీపుర్లను తొడుకుంటుంది ఆమె
తెల్లారే దాకా తుడిచే చేతులను నొక్కుకుంటూ
తనవారి ఆకలికై తాపత్రయపడుతూ తల్లడిల్లుతుంది
తాగుబోతువాహనాలను తప్పించుకుంటూ
అర్ధం కాని అహంకారులను నిట్టూర్పుతో సాగనంపుతూ ...
ఆమె రహదారుల మధ్య వ్యాక్యూం క్లీనరై సంచరిస్తుంది
శ్రమించిన బాటను జోలపాటై నిమురుతూ
రేపటికి సమాయత్తం చేస్తుంది ఆమె...
తుడిచిన దారులకు చిరునవ్వు తొడుగువేసి
చీకటిలోనే నిష్క్రమిస్తుంది ...
బ్రతుకుబాటకు వెలుతురు రంగు అద్దుకోవాలని...!!
.......వాణి,

No comments:

Post a Comment