Friday, March 1, 2019

ఆర్టిఫిషియల్ లైఫ్ ...


ఇప్పుడింకా తొందరగా వుంది
రేపటిని చేరాలని
మరురోజుకు చిత్రంగా మిగిలిపోవాలనీ
ఏమీ కానట్లు నటించే మనుషుల నుండి దూరంగా
నన్ను నేను విసిరేసుకోవాలని

పెరిగే కోరికలకు బందీలౌతూ
తరిగే విలువలకు తలవంచలేక
పెంచిన బంధాలను తుంచేసుకుంటున్న
మనుషుల జాతినుండే నిష్క్రమిఃచాలని
రూపాలెన్నో కదా ఆశకు
నాది ఆశేనేమో ఇది
ఆత్మీయమైన ఆలింగనం కావాలని
మనసు మధురంగా స్పందించే సందర్భం రావాలని
ఎవరమూ ఎవరినీ నిందించలేం
ఎందుకిలా అని ఎవరికి వారే ప్రశ్నించు కోవాలిప్పుడు
మరకలంటింది ప్రేమకు కాదేమో
మారిన మనుషుల మనసులకే కదూ
జ్ఞాపకాలు పదిలంగానే మోసుకుందాం
కాస్తంతైనా తియ్యదనం అక్కడే దొరికించు కోవాలికదా
బాల్యంలో గిలికజ్జాలు పెట్టుకున్నపుడు
చురుకుగా తగిలి దెబ్బలను కూడా
మనకు మనమే ఓదార్చుకున్నాం గుర్తొచ్చిందా..?
అపుడు గాయంకూడా ఆనందాన్నే పంచింది కదా!
ఇప్పుడెందుకు కోపాలను కౌగిలించుకుంటున్నాం
ప్రతి విషయానికి మనసును తుంచేసుకుంటున్నాం
పుట్టుకకూ గిట్టుకకూ మధ్య కాస్తంత జీవనం
జీవితం నటనైపోయాక కాలం కూడా కలుషాతమౌతూనే వుంటుంది
ఆనందం అవసరంగా మారిపోయాక
రేపటిని కూడా బరువుగానే భరించాలి
మాటలన్నీ ఆర్టిఫిషియల్ గా అనిపించడంలేదు
నేచురాలిటీ కోల్పోయిన మనుషుల మధ్య..!!
......కొరటమద్ది వాణి

No comments:

Post a Comment