Friday, March 1, 2019

నిరీక్షణ...


చీకటో వెలుతురో అర్ధం కాదు
కునుకుకీ మెలుకువకీ మధ్య నీ కోసమే నిరీక్షణ
స్వప్నంలో ఆక్రమిస్తావో
నిజంలో నాతో వుండిపోతావో ...
తెలియలేని అయోమయం
నిష్క్రమించిన నీ కోసం నిరాశ మోసే ఎదురుచూపు నాది

పగలు రేయి పలుకరించి వెళుతూనే వున్నాయి
నీ పలుకులు ఆలాపనలే అవుతుంటాయి
కలవరంగ కన్నీళ్ళను మింగేస్తూ
పలవరంగా వణికే పెదవులు బిగబడుతూ
వెలుగులున్నా చీకటి సంచారమే
మనసుకు దగ్గరగగా స్పర్శకు దూరంగా
ఆశల కొసకు వెలాడే అంధకారాన్ని నేను
నీ చివరి ప్రయాణానికి నేనెందుకు సాక్ష్యమవ్వాలి
అమాయకంగా మిగిలిన ఆసమయాన్ని నేనెలా మర్చిపోవాలి
ఏ దేవుడిని ప్రశ్నించలేని అసమర్ద వేదనే అప్పుడు
అశ్రుధారలు అర్పణచేస్తూ నన్న నేను అవనతం చేసుకోవలసిందే
బలమైన కారణాలకు బందీని చెసుకుంటూ
బ్రతుకుయుద్ధంలో బలి అవుతూ
నిశ్శబ్దాన్ని నిలువరించలేక
శబ్దాన్ని ఆస్వాదించలేక
ఆయువునివ్వలేని అమ్మగా
నువ్వు చేరువయ్యే క్షణం కోసం నిరీక్షణ ....!!
.........కొరటమద్ది వాణి

No comments:

Post a Comment