Friday, March 1, 2019

వెలుగు వెనుక దాగున్నది వెలివేసిన చీకటి ||
జాబిలి పరదా చాటున ముసుగేసిన చీకటి ||

రేతిరిలో మదిలోతును కదిలించిన గుర్తులే
కన్నీటివి కథలెన్నో దాచేసిన చీకటి ||

కాలమిచ్చు సవాళ్ళెన్నో విధివేసిన శిక్షలెన్నొ
మౌనంగా గుండెగూడు తడిపేసిన చీకటి ||

అలసిపోని ఆలోచన సలుపుతున్న వేదన
మనసుపడే సంఘర్షణ సరిచేసిన చీకటి ||

తరలిపోతు రమ్మంటు వెన్నెలతో చెలిమిగా
ఏకాంతపు తాయిలాలు పంచేసిన చీకటి ||

మధురవాణి మౌనమైన భావాలకు తోడుగా
జ్ఞాపకాల చరితలన్ని తవ్వేసిన చీకటి ||
.......వాణి కొరటమద్ది

No comments:

Post a Comment