Friday, March 1, 2019

ఆసరా.....


మరకలు అంటుకున్న మనిషితత్వం
శిధిలమైపోయిన మానవత్వం
అనుబంధాలు ఆనవాళ్ళుగా మిగిలి
అతిశయమే ఇపుడు మంచితనాలు
ఆపదలకు ఆసరా ఆశించలేని ఏకాకి జీవితాలు
గుండెకెంత గాయమైనా ఊపిరిని ఉగ్గపట్టాల్సిందే
మనసులు డబ్బుకు దాసోహమయ్యాక
ఉనికికై వెంపర్లాడాల్సిందే
ముసలితనం ఆశ్రమాలకు అంకితమయ్యాక
ఆసరా కోల్పోయిన అవసాన ముగింపులే
ఆశను కునుకు కాపలా పెట్టాక
రాత్రీ పగలు లెక్కలోకి రానివే
ఆసరా కోల్పోయిన అలసటలు
స్వార్ధం ముసుగులో సర్దుకుపోవాల్సిందే
చిరునవ్వులు నిజాయితీని కోల్పోయాక
అరువైన నగవులు అతికించుకోవాల్సిందే
ఙ్ఞాపకానికి గమనానికి మధ్య గమనించలేని
గజి బిజి క్షణాలెన్నో
స్వప్నాలకు నిజాలకు సర్దిచెప్పలేని అసహాయతలే
ఊహలు వాస్తవాలలో ఓడుతున్న వైనాలే
నాలుగు గోడల మధ్య బందీలౌతూ
సంక్షిప్త సందేశాలతో అంతరంగాలన్నీ
అంతర్జాలలోకంలో అంతుచిక్కని ఆశయాల సాధనలే
నిర్మలత్వం నివ్వెర పోయాక
నిశీధిలో నిశ్శబ్ద చింతనలే
ఆశపడే ఆత్మీయతలు అందలమెక్కాక
అనుబంధాలన్నీ ఆసరా కోల్పోతూనే వుంటాయి
ఒంటరితనాలు ప్రతిబంధకాలౌతూ....!!
........వాణి

No comments:

Post a Comment