Friday, March 1, 2019

బాల్యం ఇంకా మురిసి పోతూనే ఉంది
పుట్టినరోజున నాన్న తెచ్చిన కొత్త గౌను
అమ్మ అందించిన పాయసం
జ్ఞాపకంగా సంతోషాల సందడి చేస్తూనే ఉంది
నిన్నల్లో నిలిచి పోయిన సంగతులెన్నో
రేపటి రెక్కలు తొడుక్కుంటూనే ఉన్నాయి
గాయమైన గుర్తులు గుండెనొదలి పోనంటూ మారాం చేస్తున్నా
అరుదుగా దొరికిన ఆనందాలు కూడా
నిశల నిధులై కప్పి పెడుతూనే ఉన్నాయి
బాధలు రాల్చిన భావాలన్నీ
అక్షర వర్షమై కురుస్తూ
కన్నీళ్ళు మానసాన్ని చుట్టుముట్టినా
ఓదార్చే కవనం అందాన్ని హత్తుకుంటూనే ఉంది
అమ్మ పంచిన అనురాగాలు
నాన్న నేర్పించిన ఆత్మస్ధైర్యాలు
జీవితం నేర్పిన పాఠాలెన్నో
మరలే సంవత్సాలతోపాటూ
నడకను నేర్పూతూనే ఉన్నాయి
ప్రతిరోజు కొత్తగా
రేపటిలోకి తొంగి చూస్తూనే ఉంటుంది
సంతోషమైనా దుఃఖమైనా
కాలానికి ఒక్కటే భావన కదూ..!!

No comments:

Post a Comment