మౌనం నాకే సొంతమనుకున్నాను
మాటలు సాంతం బందీ అయ్యాక
చీకటికి చుట్టాన్ని నేనే అనుకున్నాను
వెలుతురు వెనుకే వుండి
చుట్టుకుంటోందని తెలిసే దాకా
ఙ్ఞాపకాల తవ్వకాలలో
కనుమరుగైపోని గాథలే అన్నీ
ఇగిరిపోని కన్నీటినే నేను
కావ్య రూపమై కనపడేదాకా
మనసు సంఘర్షణలన్నీ
అక్షరాలై మొలకెత్తాక
కవిత్వ ప్రపంచం నాదయ్యింది
కాగితం కన్నీళ్ళను తుడిచే అస్ర్రమై
కలంతో చెలిమి
భావ పరిమళాలు పూయిస్తోంది
ఇప్పుడు నిశీధి కూడా
వెలుతురు పంజరంలో బందీ అవుతోంది
శిధిలమైన సంతోషాలన్నీ
చిగురించే చిరునవ్వును ఆహ్వానిస్తున్నాయి
మరుగున పడిన ఏమరపాటులన్నీ
ఆలోచనతో అడుగులు కదుపుతున్నాయి
నిశ్శబ్దాన్ని నేనేనని చెప్పాలనిపిస్తుంది
హృదయ నివేదనలన్నీ
అక్షరాలలో ప్రవహిస్తున్నాయని
అనంత మౌనాలన్నీ
భావాలలో ప్రకాశిస్తున్నాయనిపిస్తూ...!!
......వాణి,

No comments:
Post a Comment