Friday, March 1, 2019

ఊపిరాగి పోతే నా ఉనికైనా ఉండనీ ||
గమనమాగి పోతే ఓ గెలుపైనా ఉండనీ ||

చీకటికే చిరునవ్వులు కానుకగా ఇచ్చేస్తే
చెక్కిలిపై ఆ మెరుపుల మరకైనా ఉండనీ ||

కన్నీళ్ళతొ కవనాలను బంధించే ఉంచానా
కావ్యంలో నాయికగా కాంతైనా ఉండనీ ||

రెప్పలపై తడితలపులు చెరపలేక పోతున్నా
నిదురించే కనుపాపకు సొగసైనా ఉండనీ ||

స్వప్నాలే మెలుకువపై అలిగి వెళ్ళి పోయాయా ?
కలలలోన మురిపాలను క్షణమైనా ఉండనీ ||

నిశీధిలో మధురమైన భావంగా మిగిలానా ?
మౌనవాణి పదములలో వెలుగైనా ఉండనీ ||
......వాణి కొరటమద్ది

No comments:

Post a Comment