Friday, March 1, 2019

నిష్క్రమించి నావుకదా నీడేదీ దొరకలేదు ||
నినుచేరగ తెరుచుకున్న తోవేదీ దొరకలేదు ||

స్మృతులెన్నో మిగిలాయి స్పర్శ వెతుకుంటున్నా
నీ ముచ్చట మౌనమాయ పలుకేదీ దొరకలేదు ||

రెప్పలపై తచ్చాడుతు కలలలోని ఆ దృశ్యం
వేకువలో మరిచానా ఉనికేదీ దొరకలేదు ||

కెరటాలను చూస్తున్నా తీరాలను తడుపుతోంది
నే గీసిన చిత్రాలకు ఋజువేదీ దొరకలేదు ||

గుండెల్లో గుబులెందుకు కలచెదిరిన కథ ఏమిటొ
మదిలోతులు చదివెెందుకు దారేదీ దొరకలేదు ||

చీకటిలో చిరునవ్వును దాచాలని లేదులే
తడిమబ్బును తొలగించే తలపేదీ దొరకలేదు ||

మనసంతా చిన్నబోయి మూగగానె మిగిలింది
మౌనానికి మాటనేర్పు భాషేదీ దొరకలేదు ||

అదిగో అటు చూడంటూ మిణుకువేదొ తళుకుమంది
చూపువెతుకు దారుల్లో ఆశేదీ దొరకలేదు ||
......వాణి కొరటమద్ది

No comments:

Post a Comment