Friday, March 1, 2019

అర్ధం కానిదే...


అవగాహన లేని ఒప్పందాలే అప్పుడన్నీ
ఆత్మే సాక్షి ఆనాటి ఆత్మీయతలకు
నమ్మకం లేని రక్తబంధాలుంటాయని
ఆలస్యంగా అర్ధమౌతుంది

తట్టుకోలేని బాధ
గుండెకు గాయమయ్యాక
ఏమార్చుకోలేని అసహాయత
ఆప్యాయతలు గుజ్జెనగూళ్ళలా కూలిపోతుంటాయి
ముందొచ్చిన చెవులకంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడని
అనుభవం నేర్పేదాకా అర్ధం కాదు
చుట్టూ విశాల ప్రపంచం వున్నా
విశాల హృదయం అరుదుగా కనిపిస్తుంది
చీకటి చుట్టమై అక్కున చేర్చుకుంటూ
గాయాలు ఓదార్చుకోమంటూ
ఆలోచన అల్లుకుంటూనే వుంటుంది
ఆశ ఇంకా అణగారిపోని ఆయుధమే
రేపు వెలుగు ఇచ్చే ఇంధనమే
కల కలవరపెడుతూనే వుంటుంది
కోరిక తీరే దాకా
మనసు కలత పడుతూనే వుంటుంది
గెలుపును హత్తుకునే దాకా
సందిగ్దం సమస్యగా మారి
రోజును బరువుగా సాగనంపుతుంది
అవకాశం అందరికీ అందుబాటుగా వుండకపోవచ్చు
ఆధారపడ్డం అనేది ఒక్కోసారి
సుడిగుండంలో ఇరుక్కున్నట్లుగా
ఉక్కిరి బిక్కిరి చేస్తూనే వుంటుంది..!!
......వాణి కొరటమద్ది

No comments:

Post a Comment