Saturday, March 2, 2019

ఎదలోన మౌనంగ కురిసేటి బాధ ||
ఙ్ఞాపకం గాలిలా తాకేటి బాధ ||
.
వడలుతూ పువ్వులా వేలాడు మనసు
వెన్నెల్లొ వేదనే మోసేటి బాధ ||

.
చూపుల్లొ నిట్టూర్పు కన్నీటి ఓర్పు
గుర్తులే గుండెల్లొ సలిపేటి బాధ ||
.
గతమైన ఘటనలే బరువైన దృశ్యం
దుఃఖాలు నీడలై పొగిలేటి బాధ ||
.
కన్నుల్లొ చీకట్లు మదిలోతు శూన్యం
గతితప్పి ఆశలే కుమిలేటి బాధ ||
.
చీకటే గెలిచిందా వెలుగునే దోచి
తడబాటు తిమిరంలొ తడిసేటి బాధ ||
.
.........వాణి కొరటమద్ది

Friday, March 1, 2019

ఎదలోన మౌనంగ కురిసేటి బాధ ||
ఙ్ఞాపకం గాలిలా తాకేటి బాధ ||
.
వడలుతూ పువ్వులా వేలాడు మనసు
వెన్నెల్లొ వేదనే మోసేటి బాధ ||

.
చూపుల్లొ నిట్టూర్పు కన్నీటి ఓర్పు
గుర్తులే గుండెల్లొ సలిపేటి బాధ ||
.
గతమైన ఘటనలే బరువైన దృశ్యం
దుఃఖాలు నీడలై పొగిలేటి బాధ ||
.
కన్నుల్లొ చీకట్లు మదిలోతు శూన్యం
గతితప్పి ఆశలే కుమిలేటి బాధ ||
.
చీకటే గెలిచిందా వెలుగునే దోచి
తడబాటు తిమిరంలొ తడిసేటి బాధ ||
.
.........వాణి కొరటమద్ది
బ్రతుకు ఆట ముగిసేపోతె మరలొస్తుందా ఏమైనా ?
జ్ఞాపంకంగ మిగిలేపోతె తరలొస్తుందా ఏమైనా ?
.
ఆశవీడదు అంతమవ్వదు ధనమే కాంక్ష కాదా ?
చివరి ప్రయాణం చిత్రమేమిటో తెలిసొస్తుందా ఏమైనా ?
.

పరిమళమద్దిన నిన్నటిపువ్వు మట్టిలొఇమిడే పోవుకద
కొత్త మొగ్గకు తావు ఇవ్వక వికసిస్తుందా ఏమైనా ?
.
సూర్యతేజము జీవనచట్రం ఆగిపోవున ఉప్పెనొచ్చిన
వేదన మనసును నలిపేస్తుంటే నవ్వొస్తుందా ఏమైనా ?
.
ఎగిసే అలలకు పారే నదులకు తీరం పాఠం నేర్పాలా
జారినమాట తరలిన కాలం తిరిగొస్తుందా ఏమైనా ?
.
తలరాతంటు తలపోస్తుంటే ఓటమి మిగిలే పోవుకద
శక్తికి ఊతం ఇవ్వకపోతె గెలుపోస్తుందా ఏమైనా ?
.
మధుర వాణియ పెదవిమాటున మౌనంగానె ఉంటోంది
నిశి రాత్రులపై నిందలువేస్తె వెలుగొస్తుందా ఏమైనా ?
.
...............వాణి కొరటమద్
ఎడబాటులు భారమౌను ఓపలేను ప్రియతమా ||
తడబాటుల బ్రతుకునావ నడపలేను ప్రియతమా ||

క్షణమైనా నీ దూరం కలనైనా కనలేదె
నీవులేని చూపునసలు కదపలేను ప్రియతమా ||

మౌనమైన మందలింపు తలవంచితి నేస్తమా
తచ్చాడే మదిని వీడి తరల లేను ప్రియతమా ||

చెలిమి తలపు వీడబోను చెదిరిపోవు చిరునవ్వె
అలుకలపై చిరు కోపము తాళ లేను ప్రియతమా ||

అంతరంగమంత నీవె అలుపు లేని సందడులె
నీవులేని నిశ్శబ్దాలు మోయలేను ప్రియతమా ||

చీకటసలె చేరదేమి వెన్నెలంత మౌనమై
శిధిలమౌతు మధురవాణి పలుక లేను ప్రియతమా ||
.......కొరటమద్ది వాణి,
తిరిగిరాని బాల్యానికి తరలి వెళితె బాగుండును ||
అందమైన లోకానికి తిరిగి వెళితె బాగుండును ||

కల్మషమే లేనితనం అలనాటిది సంబరం
చిందులేయ పసితనంకి మరలి వెళితె బాగుండును ||

లెక్కించని ఆ కాలం ఎలా వెళ్ళి పోయిందో
చెలిమి పూలు ఏరెందుకు మళ్ళి వెళితె బాగుండును ||

అదే మట్టి అదే చెట్టు మధురమైన జ్ఞాపకాలు
అరుదైనది ఆనందం తలచి వెళితె బాగుండును ||

ప్రియమైనది నానేస్తం మనసులోన మెదిలింది
తన స్నేహపు సుగంధాలు తీసి కెళితె బాగుండును ||

గుర్తెరిగిన వాన ఆట పడి లేచిన పరుగులాట
మురిసిపోవ మనసంతా కదిలి వెళితె బాగుండును ||

ఓ మాధవి కౌసల్యా వినలేదా నా వాణీ
తీరంలో మన సందడి చూసి వెళితె బాగుండును ||
.....వాణి కొరటమద్ది
కరిగిపోయిన కలలరూపం చెంతచేరిన ఎంతహాయీ ||
మూగబోయిన మధురవాణియ పెదవివిప్పిన ఎంతహాయీ ||
.
ఙ్ఞాపకాలే నిధులుఅయితే గాయఘటనలు మరువలేమే
వెంటవచ్చే వేదనంతా చెరిగిపోయిన ఎంతహాయి||

.
కాలమెంతటి కఠినమైనదొ పసితనాలకు శిక్షవేస్తూ
చిలిపినవ్వులు మాలగుచ్చుతు కానుకిచ్చిన ఎంతహాయీ ||
.
నిన్నమొన్నలు మసకబారక మనసులోనే నడుస్తున్నవి
చేదునింపిన చరితలన్నీ చెరిగిపోయిన ఎంతహాయీ ||
.
పలకరింపులు జ్ఞాపకాలే బంధాలన్ని ప్రశ్నలైనవి
గమనమంతా గతములోనే సంచరించిన ఎంతహాయీ ||
.
రాలుతున్నవి అక్షరాలే మౌనమైనవి భావఝరులే
మూగబోయిన ఆశలన్నీ మురిసిపోయిన ఎంతహాయీ ||
.
చింతలన్నీ విసుగుచెెందితె చరమగీతం పాడమంటిని
నవ్వులోకం హత్తుకుంటూ స్వాగతించిన ఎంతహాయీ ||
.
......వాణి కొరటమద్ది
తొలిస్పర్శ మనసంత నిమురుతూ ఉంటుంది ||
తండ్రైన గర్వమే నిండుతూ ఉంటుంది ||

మురిపంగ లాలిస్తు చేతుల్లొ పసితనం
సంతోష సవ్వడులు నింపుతూ ఉంటుంది ||

కదిలికలు మధురమై నాదైన పాపాయి
నాన్నంత తనదని నవ్వుతూ ఉంటుంది ||

నా కలల లోకంలొ అరుదైన అదృష్టం
చిరునవ్వు దీవెనగ చేరుతూ ఉంటుంది ||

తన బోసి నవ్వుల్లొ విజయాలు నావౌతు
ఆశ్చర్యమందంగ మిగులుతూ ఉంటుంది ||

చూపుల్లొ ప్రేమెంత ఆటల్లొ కేరింత
దరహాస మధురిమలు అద్దుతూ ఉంటుంది ||

నన్నంత మరిపిస్తు తానంత నాదౌతు
వెంటాడు ఆశగా తాకుతూ ఉంటుంది ||

ఇల్లంత గలగలలు తన అందె రవములతొ
కిలకిలల నవ్వులతొ వెలుగుతూ ఉంటుంది ||

చిన్నారి అమ్మగా అనురాగ మద్దుతూ
తడితలపు గుండెల్లొ తడుపుతూ ఉంటుంది ||
.........కొరటమద్ది వాణి
చిరునవ్వు సందడిని చెరిపేది గాయం ||
చీకటిని చిత్రంగ చుట్టేది గాయం ||

అపురూప రూపాన్ని మింగింది కాలం
వేదనను మౌనంగా మోసేది గాయం ||

ఆశల్ని అలసుగా తుడిచేసి పోతూ
కన్నీటి నదిలోన ఈదేది గాయం ||

ఓ భ్రాంతి కాంతికై తడుము కుంటోంది
గుర్తులతొ గుండెల్ని పిండేది గాయం ||

అశ్రువులు అలిశాయి చింతల్ని మోసి
దుఃఖాల నావనే నడిపేది గాయం ||

రహదారి అందమే ఆనంద నడకలో
అదృశ్య మైపోతె మిగిలేది గాయం ||

శూన్యంలొచూపులే తచ్చాడుతున్నా
నిశిలోన వాణిగా చరిచేది గాయం ||
.......వాణి కొరటమద్ది
ఎన్ని ఆకలి రాత్రులు నిశ్శబ్దంగా మింగేశాడో
ఎన్ని కన్నీళ్ళతో భూమాతను అభిషేకించాడో
గమనించని బాటసారులెందరిని ఆర్తిగా వేడుకున్నాడో
చీదరించిన చూపులకు చితికి పోయాడు

కడుపునింపని కాలానికి సలాం చెప్పేసి
చిట్టి చేతులకు గాయాలు చేసుకుంటున్నాడు
పదిలంగా హత్తుకునే ఆత్మీయత కరువైయిందేమో
పలుకరించే ఊపిరికి ఊతమవ్వాలనుకున్నాడు
ఆకలి తీర్చే అమ్మే దూరమైయ్యిందేమో
పేదరికం వెక్కిరించి వేదనకు గురిచేస్తుంటే
తప్పని బ్రతుకు పోరాటంలో
బాల్యాన్ని పనికి తాకట్టు పెట్టాడు
రేపటి పౌరుడి పసితనం పనికి బానిసౌతోంది
స్వార్దం రాజ్యమేలుతుంటే
పిల్లల చిరునవ్వులు వెట్టి చాకిరికి అంకితమౌతున్నాయి.
తరలిపోతున్న సంవత్సరాలు చూస్తున్నాం
మార్పురాని బ్రతుకు చిత్రాలను చూడలేక....!!
.....వాణి కొరటమద్ది,
వెలుగు వెనుక దాగున్నది వెలివేసిన చీకటి ||
జాబిలి పరదా చాటున ముసుగేసిన చీకటి ||

రేతిరిలో మదిలోతును కదిలించిన గుర్తులే
కన్నీటివి కథలెన్నో దాచేసిన చీకటి ||

కాలమిచ్చు సవాళ్ళెన్నో విధివేసిన శిక్షలెన్నొ
మౌనంగా గుండెగూడు తడిపేసిన చీకటి ||

అలసిపోని ఆలోచన సలుపుతున్న వేదన
మనసుపడే సంఘర్షణ సరిచేసిన చీకటి ||

తరలిపోతు రమ్మంటు వెన్నెలతో చెలిమిగా
ఏకాంతపు తాయిలాలు పంచేసిన చీకటి ||

మధురవాణి మౌనమైన భావాలకు తోడుగా
జ్ఞాపకాల చరితలన్ని తవ్వేసిన చీకటి ||
.......వాణి కొరటమద్ది
మౌనాలను రంగరించి మనసు లేఖ రాస్తున్నా ||
మదినిండిన ప్రేమలతో హృదయ లేఖ రాస్తున్నా ||

అనుభూతుల పరిమళాలు గుర్తులలో సంబరాలు
గతమైనవి సంగతులే ప్రేమ లేఖ రాస్తున్నా ||

ఇదిగోఇటు చూశావా చెక్కిలిపై చిరుసిగ్గులు
గుండెల్లో వికసించిన మధుర లేఖ రాస్తున్నా ||

చందమామ నవ్వుతోంది నా మెరిసే మోముచూసి
వెన్నెలలో ఆ ముచ్చట మెరుపు లేఖ రాస్తున్నా ||

నిన్నలలో నిలిచానా భావాలలో నిండిపోతు
మందస్మిత లాలనతో కలల లేఖ రాస్తున్నా ||

ఓ ఊహల చెమరింపులు ఉద్వేగపు సంతకాలు
క్షణమైనా తలవలేని తలపు లేఖ రాస్తున్నా ||

అందమైన అద్భుతాలు మౌనవాణి అక్షరాలు
తచ్చాడే నీరూపం చిత్ర లేఖ రాస్తున్నా ||

నినుచూడని ఘడియల్లో నిట్టూర్పులు మోయలేను
అతిశయంపు రంగుల్లో వర్ణ లేఖ రాస్తున్నా ||
....కొరటమద్ది వాణి

సందిగ్దం ....


నియంత్రించలేని మనసు వెంట పడుతూనే వున్నామేమో
కోపము బాధ కలగలసిన మౌనానికి సర్ది చేప్పలేని నిస్సహాయత
ఎదురుచూసే సంఘటలకు స్పందన కరువైనట్లు
అర్ధం కాని సంఘర్షణే అంతా ఇపుడు

అవసరాలకు సహకరించిన సందర్భాలను
గతమైన సంగతులేవి గుర్తుపెట్టుకోలేని బంధాలను
వివక్షలతో విచక్షణ కోల్పోయిన మనుషులు
మారుతున్న ప్రవర్తనలను అంగీకరించలేని అంతరంగం
ఊగిసలాడే శ్వాసలు
ఊసూరంటున్న జీవితాలు
స్వార్ధం సంచరిస్తూ ఎవరు ఎవరికీ ఏమి కానట్లు
కదిలే కాలం కరగని మనసులు
గమనించలేని బ్రతుకుపోరాటం
మొహమాటపు పలుకరింపులు
ఆహ్లాదం మరిచిన రోజులే అన్నీ
పరుగెట్టె క్షణాలతో మనసు బందీ ఇపుడు
ఒంటరి జంటలు ఒరిగే కాయాలు
సమాజాన్ని ఉద్ధరించే వృద్ధాశ్రమాలు
కలలను మరిచిన గమనంలో
యుద్ధానికి సన్నద్ధమౌతూనే వుంది ప్రతినిమిషం
రాత్రిని చేరేందుకు ఆత్రంగా
రేపటిని పట్టుకునేందుకు ఆశగా...!!
......కొరటమద్ది వాణి
కునుకుతాకి కనుపాపకు కల ఏదో దొరికిందీ ll
నిశ్శబ్దం బద్దలౌతు పలుకేదో దొరికిందీ ll

మనసు మాలల్లల్లుతోంది మౌనవాణి ఙ్ఞాపకాలు
అక్షరాల లాలనలో శాంతేదో దొరికిందీి ll

ఓ నవ్వుల శబ్ధమేదొ నన్నుతాకి వెళుతోంది
చూపులకే వెలుగునిచ్చు కాంతేదో దొరికిందీ ll

దూరంగా వుంటోంది దగ్గరగా రమ్మంటూ
స్వప్నాలను స్పర్శించని వరమేదో దొరికిందీ ll

అభిమానపు సంపదలే అడుగంటెను నేస్తమా
భావాలకు ప్రాణమిచ్చు కలమేదో దొరికిందీ ll

కాలానికి పరదాలను కప్పివుంచ లేముకదా
ఎదురుచూపు మౌనానికి ఆశేదో దొరికిందీll
.........వాణి కొరటమద్ది