Thursday, April 19, 2018

Image may contain: one or more people and closeup
ముగిసిపోయిన జీవచరితలు మౌనభాష్పం రాల్చుతున్నవి ||
కరుణనిండిన చూపులన్నీ బాధకర్ధం తెలుపుతున్నవి ||

గోడపైననె గాధలెన్నో చిత్రమైనవి సాక్షమౌతూ
ఙ్ఞాపకాలలొ మరకలేఅవి గతిని గాయం చేయుచున్నవి ||

వెల్లివిరిసిన లాస్యమేదని మూగమనసులు ఘోషపెడుతూ
కలసినడచిన అడుగులన్నీ శూన్య గమనం చాటుతున్నవి ||

ఏది ఏదని వెతుకుతున్నది మనసు తాపం వీడిపోదేం
హృదయభారం ఓపలేకనె కలలు భాష్యం పలుకుతున్నవి ||

మధురహాసం మాయమయ్యెను చెమ్మగిల్లిన రూపమౌతూ
తిమిరతరగలు చెరిగిపోకనె శిశిర రాగం పాడుతున్నవి ||

శిధిలమైనవి ఆశలన్నీ పెదవిదాటవు నవ్వులేవీ
మధురవాణివి తప్పటడుగులు చిద్విలాసం వెతుకుతున్నవి ||

ఊపిరాగదు ఉనికిమరవదు చిత్రమైనవి క్షణములన్నీ
ఊహమరచిన కంటిపాపలు కాంతి వర్ణం కోరుతున్నవి ||
........వాణి, 
Image may contain: one or more people, cloud and sky
అదివెన్నెల మరకేనా తాకుతోంది నిజమేనా ||
మదిదాచిన చీకట్లను తరుముతోంది నిజమేనా ||

ఎందుకలా మానసమే మౌనంగా మారుతోంది
మధురమైన భావమేదొ ఫలిస్తోంది నిజమేనా ||

గతములోన కలలన్నీ కాలిపోయి కుమిలాయా
కలతంతా కన్నీటిలో కరుగుతోంది నిజమేనా ||

వెనుదిరిగే చూస్తుంటే ఓటములే పిలిచాయా
మనసంతా వేెదనైన నెగ్గుతోంది నిజమేనా ||

ఆశయాల ఆరాటం అలుపెరుగదు తనువేమో
తల్లడిల్లు తడబాటును గెలుస్తోంది నిజమేనా ||

కునుకుతీయు మనసులోన కలలెన్నో సందడిగా
వెతలబ్రతుకు విజయాలను వరిస్తోంది నిజమేనా ||

చూడు చూడు రేయంతా చింతలనే నిలదీశెను
కన్నీళ్ళను కావ్యంగా మలుస్తోంది నిజమేనా !!

నిశీధులే నిలవలేక వెలుతురులో కలిశాయా
మౌనవాణి హర్షంలో తడుస్తోంది నిజమేనా ||
........వాణి,
Image may contain: 1 person
నా మౌన దీక్షనే చెరిపేసి వెళ్ళింది ||
తన ప్రేమ తెమ్మెరతొ తాకేసి వెళ్ళింది ||

ఓ స్వప్న కాంక్షనె నాలోన నింపేసి
మరు ధ్యాస లేకుండ చేసేసి వెళ్ళింది ||

ఏమాయ ఏమిటో అరుదైన పులకింత
తనరూపు మనసంత నింపేసి వెళ్ళింది ||

తడికాలి ముద్రలతొ ఇల్లంత చుట్టేసి
ప్రతి అడుగుపై పేరు చెక్కేేసి వెళ్ళింది ||

తానంటె నేననీ విడదీయ వద్దనీ
చెంపపై తాకుతూ చిటికేసి వెళ్ళింది ||

నిద్దురే మరిచాను తనలోన నిలిచాను
ఊహంత ఊపిరిగ ముడివేసి వెళ్ళింది ||
........వాణి,
నిశ్శబ్దం దాచేసిన గుర్తులెన్ని ఉన్నాయో ||
మదిమోసే సంద్రంలో గాధలెన్ని ఉన్నాయో ||

పల్లవించు రాగాలకు పదములెన్ని కూర్చాలో
పడిలేచే తరగల్లో చినుకులెన్ని ఉన్నాయో ||

చుట్టలేని ఆకాశం శూన్యానికి చిరునామా
చీకటిలో వెన్నెలలో చరితలెన్ని ఉన్నాయో ||

నీడలతో చెలిమేగా నిందించకు నిశీధిని
నీ అడుగుకు తోడునడచు మిణుకులెన్ని ఉన్నాయో ||

సంతోషమొ దుఃఖమో పదిలమైన ఙ్ఞాపకమే
గతమంతా మరపురాని ఘటలెన్ని ఉన్నాయో ||

కనుపాపకు నివేదించ కరిగిపోని ఆవేదన
మౌనవాణి గుండెల్లో మలుపులెన్ని ఉన్నాయో ||

ఊహచేయు వింతలెన్నొ ఉనికిచాటి విసిగిస్తూ
విరామమే లేని మనసు తలపులెన్ని ఉన్నాయో ||
.......వాణి,
దుఃఖాల పరదాలు తీసేసి వెళ్ళు ||
కాసిన్ని హాసాలు విసిరేసి వెళ్ళు ||

శోధించు ఆశలో కంటినే తాకవా
చూపుల్లో కాంతుల్ని నింపేసి వెళ్ళు ||

కన్నీళ్ళు కురిసింది లోతుల్లొ ఙ్ఞాపకం
అనుభూతి అందాలు పంచేసి వెళ్ళు ||

సంతోషమరుదుగా దొరికింది తెలుసా
ఆనంద అమృతం ఒంపేసి వెళ్ళు ||

నటనలో నవ్వుల్ని ఏరుకుంటున్నా
ఓ నవ్వు తెమ్మెరగ వీచేసి వెళ్ళు ||

నిన్నలన్ని నా వెంట నడచొస్తు ఉంటే
వేదించు చిహ్నలు సరిచేసి వెళ్ళు ||

వాణినే మౌనమూ పలుకులే పదిలమూ
మాటల్ని మధువుగా రాల్చేసి వెళ్ళు ||
.....వాణి,
No automatic alt text available.
ఎదురౌకాలం ఆనందాలతొ నడిచొస్తుంటే పండుగకాదా ||
 క్షణాలుఅన్నీ చిరునవ్వులతో నిండొస్తుంటే పండుగకాదా ||

చీకటి మబ్బులు నిన్నటి దిగుళ్ళు వద్దొద్దన్నా వెంటే వస్తే
మాసం అంతా పున్నమిరోజుల వెలుగొస్తుంటే పండుగకాదా ||

కోరికలన్నీ కలగామిగిలితె ఊపిరి ఉనికిని మరిచిపోయెనే
కరిగే పోయిన ఆశలు ఎన్నో కదిలొస్తుంటే పండుగకాదా ||

లేతవయసులో చిదిమిన గాయం బ్రతుకుయాత్రనే చెరిపివేశెనే
మమతతీరగా వరాలబంధం తిరిగొస్తుంటే పండుగకాదా ||

జీవితమంతా అనుభవమంటే సంతోషానికి సంబరమెప్పుడు
ఓటములన్నీ విజయాలౌతూ పిలిచొస్తుంటే పండుగకాదా ||

మధురవాణిది మౌనప్రయాణం నిశలను నింపిన వెలుతురుదాహం
భావయాత్రలే అక్షరనిధులై వెలిగొస్తుంటే పండుగకాదా ||
........వాణి,
Image may contain: 1 person, standing and outdoor
మనసు దాచిన మౌన బాధను ఎలాచెప్పను మరాళమా ||
ఆరిపోయిన తీపి చెమ్మను ఎలాచూపను మరళామా ||

నిన్న రాతిరి వెన్నెలెంతగ విందు చెసెనో తెలియునా
మధుర సంగతి మూగబోయెను ఎలావిప్పను మరాళమా ||

కునుకుతాకిన,రెప్పవాలిన ఉలికిపాటులువెతుకుచుండెను
కలల రాజును స్వాగతించగ ఎలాగడపను మరాళమా ||

రేయి అంతా వీగిపోయెను నిశబ్దానికి నడకలొచ్చెను
అలసిపోయెను కాలమంతా ఎలావెతకను మరాళమా ||

కలల కాంక్షలు కోలిపోతిని ఎదురు చూపులు ఓడిపోతిని
ఇష్టసఖునికి కష్టమేమిటొ ఎలాతెలియను మరాళమా ||
.......వాణి
Image may contain: drawing
మనసును తాకే సంఘర్షణలో దుఃఖం ఉన్నది ||
చింతను చిలికే మదిలోతులలో గాయం ఉన్నది ||

ఆశల వారధి దాటలేవులే దాహం తీరదు
వెతలేతీరని ఆరనిమంటల శోకం ఉన్నది ||

తిమిరం చాటున మసలేవెన్నెల ఉరకలుచూడు
చెలిమిగ చెప్పే ధైర్యంనాటే కిరణం ఉన్నది ||

మట్టిదుప్పటికి మమతలుఅద్దిన గమ్యంమారదు
రేపటికైనా ముగింపుపలికే మరణం ఉన్నది ||

అమ్మప్రేమలో దాగినఅమృతం ఆరిపోదులే
ఆఖరుదాకా చెరిగేపోదది గారం ఉన్నది ||

అక్షరవాణిది అలసటలేని మనసుప్రయాణం
ఎదలోదాగిన ఎన్నో కథలకు ఊతం ఉన్నది ||
........వాణి,

...దేశానికి చిరునవ్వులం...



దేశం వాకిట నిలచిన చిరునవ్వులం
భావి భారతానికి పునాది రాళ్ళం
కడుపు నిండకున్నా కవాతు చేస్తాం
కన్నీళ్ళు తుడవకున్నా దేశానికి జే కొడతాం

పుట్టినగడ్డకి నిత్యం ప్రణమిల్లుతూనేవుంటాం
మా మట్టిని మేము ముద్దాడుతూనే వుంటాం
దేశం మాకేమివ్వలేదనలేదులే నేస్తం
ఏలికల స్వార్ధానికి సమిధలమౌతూనే వుంటాం
అలమటించే ఆకలి ఆశను
అదుముకుంటునే వున్నాం
మా కన్నీళ్ళతో దేశమాతను అభిషేకిస్తూనే వున్నాం
నటించే నేతకు వినిపించవు ఆర్తనాదాలు
కనిపించవు వారి వాహన చక్రాలకంటిన నెత్తుటి మరకలు
నగుబాటుగానే మిగిలిన దృశ్యాలం
చీకటి చరిత్రగా మిగిలిన సాక్ష్యాలం
అయినా జాతీయజెండా మా ప్రాణం
జై హింద్ అంటూనే ఊపిరి ఉనికిని చాటుతాం
బ్రతుకుకు బాసటనిస్తే బ్రహ్మాండాలు సృష్టిస్తాం...!!
...వాణి,
జీవనచట్రం జరగాలంటే - కాలపుకదలిక అవసరమేగా ||
పదములు అడుగులు నేర్వాలంటే - ఆశకు ఓపిక అవసరమేగా ||

చీకటి తీరపు వెన్నెల ఊహలు - మానసంలో మధురపుతలపులు
వెలుతురు బావిని ఈదాలంటే - మనసుకు జీవిక అవసరమేగా ||

మది సామ్రాజ్యంలో మెదిలే యోచన - అక్షరనావను నడుపుతున్నదీ
కవన జగతిలో భావప్రయాణం - మాటకు భూమిక అవసరమేగా ||

అనుబంధాలకు అలసటెందుకో - మమతలు మరుగున పడుతున్నాయే
అనురాగానికి అర్ధం తెలిపే - పలుకుల పదనిస అవసరమేగా ||

ఙ్ఞాపక గాయం రగిలే దుఃఖం - గాయం గేయం పాడుతున్నదీ
హృదయ సముద్రం ఎగిసేవేదన - గురుతుల చారిక అవసరమేగా ||

మధురవాణిదీ సంకట వేదన - సవరణకసలే సాధ్యంకాదే
నిన్నటి కథలే శోకపు శ్లోకం - మెరుపుల నవలిక అవసరమేగా ||
.........వాణి, 
Image may contain: ocean, water, cloud, sky, outdoor and nature
మనసు పలికే మౌన గీతం కలల కవనం చిత్రమే !!
ఊహ చెప్పిన ఊసులే అవి మధుర భావం చిత్రమే !!

ఎండ మావులు హృదయ సీమలు వేదనైనవి చరితలె
గుండెలోతుల గురుతులెన్నొ ఎడద గాయం చిత్రమే !!

తనివితీరదు కోరికేమో కాలమేఘం తరుముతున్నది
అందమైనది స్వప్నజగతది నిదురలోకం చిత్రమే !!

సరసమైనది వెన్నెలంట స్వాగతించెను చిలిపిఊహలు
రంగురంగుల ఇంధ్రధనువుకు సప్త వర్ణం చిత్రమే !!

అలసిపోనిది కెరటమెప్పుడు నిత్యమైనది ఆరాటమే
ఇంకిపోనిది జలధినిధియే అలల పయనం చిత్రమే !!
....వాణి
Image may contain: 1 person
జ్ఞాపకాలే పరిమళాలై రాలిపోయెను నేస్తమా ||
విచ్చుకున్నవి ఊహలెన్నో విరిగిపోయెను నేస్తమా ||

నీవులేనిదె లోకమందున నిలువలేనిక క్షణముకూడా
కాలమింకను కదలనన్నది ఓడిపోయెను నేస్తమా ||

వెలితి గుండెను వేడలేనిక వెలుతురునిక వెతకలేను
వెలిగి పోయిన నిన్నలన్నీ వడలిపోయెను నేస్తమా ||

ఒంటరైతిని ఓడిపోతిని నీవులేకనే నిలిచిపోతిని
అలసి ఉన్నది మనసుకూడా వెలసిపోయెను నేస్తామా ||

రెండుగుండెల హృదయభాషను మధురరచనగ నిలిపినాను
తనువు తపనతొ తల్లడిల్లుతు తరలిపోయెను నేస్తమా ||
......వాణి,

నీలిరాగము...


చితికిన చీకటికి వెలుతురును కానుకిస్తూ
వాకిలి తెరిచిన తూరుపు
వెచ్చటి కిరణాన్ని హత్తుకోమంటుంది
బాల్కనీలోని తులసిమొక్క
దూరంగా ఆకులతో పలుకరించే వేప కొమ్మ
పచ్చటి నవ్వులతో పలుకరిస్తాయి
నిర్లిప్తమైన నిన్నలన్నీ
నిశ్శబ్దంగా జారుకుంటాయి
ఆహ్లాదమైన ఉదయం
మంచు కురిసిన వైనం
మౌనం హత్తుకునే తీరం
అలజడి మదికి ఆలంబనౌతాయి
తడి తలపుకు తన్మయత్వమద్దుకుంటూ
పంచభూతాలకు ప్రణమిల్లుతాను
ఉషోదయం ఊరడించాక
ఊహలు ఉల్లాసమౌతాయి
ప్రకృతి నీలిరాగమాలపించాక
మానసంలో మరకలన్నీ చెరిపేసుకుంటాను..,,!!
....వాణి
Image may contain: 1 person
అద్వితీయ ఆనందపు అందాలను చూస్తున్నా !!
కలలలోన కమ్మనైన మర్మాలను చూస్తున్నా !!
.
నిదురరించే లోకమదీ అతిశయాల కానుకదీ
మమకారపు సామ్రాజ్యపు స్వప్నాలను చూస్తున్నా !!
.
అలసివున్న మానసమే మౌనంగా మారిందీ
రెప్పవెనుక ఆశ్చర్యపు స్వర్గాలను చూస్తున్నా !!
.
హరివిల్లును నేనౌతూ విహరిస్తూ ఉన్నానా?
సౌందర్యం సిగ్గుపడే వర్ణాలను చూస్తున్నా !!
.
అమరశిల్పి దివిలోనికి సంచరింప వచ్చాడా ?
జక్కనయే చెక్కినట్టి శిల్పాలను చూస్తున్నా !!
.
ఊహలలో నాకెదురుగ కమనీయపు దృశ్యాలవి
చెరిగిపోని ఘనమైన భావాలను చూస్తున్నా !!
.
....వాణి

చీకటెపుడూ నిత్యమేనని - రోజులెపుడూ చెప్పలేవూ ||
నలుపుతెరలను చెరపలేమని - కాంతులెపుడూ చెప్పలేవూ ||

ఆరిపోవీ నీటిచుక్కలు - గుండెగాయపు ఆనవాళ్ళవి
వేదనే ఒక భావమంటు - ఊహలెపుడూ చెప్పలేవూ ||

మనసులేమిని ఓపలేమని - కనులు చెప్పెను భాష్పమొలుకుతు
మధురదృశ్యం మరుగుకమ్మని - చూపులెపుడూ చెప్పలేవూ ||

కంటి ఇంటిలొ కలల ముచ్చట - వెలుగుతున్నవి కాంక్షలెన్నో
గాఢనిద్రలొ సందడేమిటొ- ఆశలెపుడూ చెప్పలేవూ ||

పండువెన్నెల నిండుకుండగ - పలుకరించెను ప్రేమస్పర్శతొ
మబ్బుతరగను అడ్డురమ్మని - తలపులెపుడూ చెప్పలేవూ ||

అంతులేనిది ఆత్మపయనం - అలసిపోదది అంతరంగం
హృదయలోతుల సంగతేమిటొ - పలుకులెపుడూ చెప్పలేవూ ||

ఎండమావులు ఎడదగదులు - చెరిగిపోవేం చేదుమరకలు
వేదనల్లో వెంటరామని - మమతలెపుడూ చెప్పలేవూ ||
......వాణి, 
Image may contain: one or more people and closeup
గాయమైన రేతిరెలా ముగిసిందని అడగకూ ll
కన్నీటిని వేకువెలా తుడిచిందని అడగకూ ll

నిదురించని రేయంతా నీ కోసం ఆరాటం
జ్ఞాపకాన్ని మనసుఎలా మోసిందని అడగకూ ll

నాకు నేను అర్ధమైన క్షణమొక్కటి లేదుకదా
నిన్నలలో కాలమెలా గడిచిందని అడగకూ ll

నిట్టూర్పుల గాలులలో కనిపించదు ఆవేదన
గుండెలయతొ మౌనమెలా పలికిందని అడగకూ ll

నిశీధిలో నిలచున్నా వెలుగువైపు చేరలేక
దూరంగా మిణుకురెలా మెరిసిందని అడగకూ ll

తడుస్తున్న చీకటిలో కలలు వెతుకుంటున్నా
చిరునవ్వుకు ఓటమెలా కలిగిందని అడగకూ ll
.........వాణి,
నిశ్శబ్దాన్ని నేనేనని చెప్పాలని ఉంటుంది ||
మౌనంగా మాటలన్ని విప్పాలని ఉంటుంది ||

విషాదాల నెలవులోన నిలవలేక పోతున్నా
అశ్రువులకు ఆకాంక్షలు అద్దాలని ఉంటుంది ||

జీవయాత్ర ముగిసిపోతె తలవంచక తప్పదులే
చెలిమిగానె బ్రతుకంతా గడపాలని ఉంటుంది ||

ఓ పుష్పం మధుహాసం అందమైన ఆహ్లాదం
చిరునవ్వుల భాష్పంగా మిగలాలని ఉంటుంది ||

గాయమైత్రి నాదయినా గమనానికి బానిసనే
కవనంలో కలలన్నీ నింపాలని ఉంటుంది |||

అక్షరమే నేనంతా దివ్యవాణి నా దంతా
మాధుర్యం భావనగా ఒంపాలని ఉంటుంది ||
.........వాణి,
వెన్నెలయే వేదనలను వలచినట్లు ఉందేమిటి ||
నిన్నలతో నిశలన్నీ కరిగినట్లు ఉందేమిటి ||

మధురమైన మౌనమేదొ మదిని ముంచివేస్తోంది
మనసంతా అందియలే మ్రోగినట్లు ఉందేమిటి ||

బాటంతా చెమరించిన చుక్కలెన్ని కురిశాయో
చూపులపై చిరునవ్వులు చిలికినట్లు ఉందేమిటి ||

నిట్టూర్పులు నిధులైతే నిరసనెంత తెలిపానో
చిత్రంగా నవ్వుపూలు రాలినట్లు ఉందేమిటి ||

కుములుతున్న కంటిపాప మమతస్పర్శ కోరింది
ఊహించని ప్రేమజల్లు తడిపినట్లు ఉందేమిటి ||

వడలుతున్న తరులతయే వానచినుకు అడిగింది
ప్రియముగానె హిమవర్షం కురిసినట్లు ఉందేమిటి ||

మౌనవాణి జ్ఞాపకాల వనములోన విహరిస్తే
మరందాల కొలనులోన ఈదినట్లు ఉందేమిటి ||
........ వాణి ,
కాంతివిలువ తెలిసేందుకు మెరుపొక్కటి చాలదా ||
కన్నీళ్ళను తుడిచెెందుకు మమతొక్కటి చాలదా ||
.
చెరిగిపోయి రంగులకల ముడివేసిన నవ్వులతెర
ఆశయాలు గెలిచేందుకు ఆశొక్కటి చాలదా ||
.

మూసుకున్న చూపులలో వేలాడే ఊహలెన్నొ
వెన్నెలలే నింపేందుకు స్పర్శొక్కటి చాలదా ||
.
నిస్సహాయ క్షణాలెన్నొ మౌనాలే ఓదార్చుతు
కన్నీటికి నిందెందుకు విలువొక్కటి చాలదా ||
.
చీకటులే చుట్టుకుని ఆలోచన చుట్టుముట్టి
చిక్కుముడులు విప్పేందుకు తోడొక్కటి చాలదా ||
.
మౌనవాణి మనసుచెప్పు అందమైన ఆవేదన
మౌనాలను చీల్చెందుకు మాటొక్కటి చాలదా ||
.
విషాదాలు రాల్చుకున్నచుక్కలెన్నొ చెక్కిలిపై
ఆవేదన మరిచెందుకు ప్రేమొక్కటి చాలదా ||
.
రాలిపోయి పువ్వులెన్నొ గాయపడ్డ గుండెలెన్నొ
చిరునవ్వులు పంచెందుకు మనసొక్కటి చాలదా ||
.
యాంత్రికమే జీవితాలు నటనగానె ఆప్యాయత
అపార్ధాలు తొలగెందుకు పలుకొక్కటి చాలదా ||
.........వాణి,
Image may contain: swimming
ఙ్ఞాపకాల మౌనభాష అల్లుతోంది ఏకాంతం ||
గేయసుధల పరిమళాలు చల్లుతోంది ఏకాంతం ||
.
శూన్యానికి తోడౌతూ తడికంటిలో జాడౌతూ
మదిరాల్చే చినుకులలో తడుస్తోంది ఏకాంతం ||

.
చీకటింటి చిరునవ్వులు సరాగాల సౌరభాలు
పరవశాల తాపాలను పంచుతోంది ఏకాంతం ||
.
అరుదైనవి అనుభవాలు అంతరంగ మధనాలే
స్వప్నలిపిని సుమధురంగ చెక్కుతోంది ఏకాంతం ||
.
విషాదాల ఓదార్పులు శూన్యంతో స్నేహాలు
తలపులలో తలపోతలు ఓర్చుతోంది ఏకాంతం ||
.
మౌనవాణి మానసమే భావాలకు తోరణమే
అక్షరమే ప్రియమౌతూ తరలుతోంది ఏకాంతం ||
.......వాణి,
వేదనలో మధురమైన మౌనభాషయే గజల్ ||
అక్షరాల వెలుగునింపు కాంతిబాటయే గజల్ ||

చీకటిలో దీపమౌతు చెరిపివేయు దుఃఖాలు
కన్నీటికి రాగమద్దు మనసుమాటయే గజల్ ||

ఎదలోతుల దీనగాధ దిగులుపొరను దాచలేక
చూపులకే మెరుపులద్దు తళుకుతారయే గజల్ ||

కనుపాపల సంద్రంలో ఙ్ఞాపకాల జల్లుల్లో
చలచల్లని మమతపంచు మంచువానయే గజల్ ||

శిధిలమైన చిరునవ్వులు రాలిపోయి స్వప్నాలు
పల్లవించు చైతన్యపు స్నేహధారయే గజల్ ||

మౌనవాణి భావనలో గేయమైన గాయాలు
కలలెన్నో నింపుకున్న వెలుగురేఖయే గజల్ ||

కునుకులేని రేయిలోన శూన్యంతో సంభాషణ
రెప్పలకే మమకారపు జోలపాటయే గజల్ ||
......వాణి ,
నా ప్రియమైన నీకు ...
నీ సునితమనస్సు వెల్లడించే భావాలు నన్ను మరోలోకంలోకి తీసుకెళ్ళిపోతున్నాయి. నీ లేఖల్లో దాగుండిన నేను నీ హృదయ సామ్రాజ్యంలో విహరిస్తూ నన్ను నేను మరిచి మౌనమై ఓ కొత్త ప్రపంచంలో మనదైన వెన్నెలలో సంచరిస్తుంటాను..
సంభాషించాల్సిన భావాలన్నీ మౌనక్షణాలు లెక్కించు కుంటున్నాయి. ఎదురుచూపుల భారాన్ని నేను మాత్రం మోయటం లేదా చెప్పు. ఊహల ఊసులు కలల కావ్యాలు మనసులోనే రచించుకుంటున్నాము కదా... పలుకరింతల్లో ప్రేమను స్పర్శించలేక...దూరమైన మాటల్లొ నిరాశ దాగుడుమూతలు ఆడుతున్నా ..మాటల్ని ఓడిపొతూ మౌనాన్ని హత్తుకుంటూనే ఉంటాను..
ఏదో చెప్పాలని ఆశ.. గుండెల్లో దాచుకున్న భావాలన్నీ నీ మనసులో కుమ్మరించాలని ఆరాటం... అలసిపొతున్నా కానీ,.. అంతరంగంతో యుద్ధం అనివార్య మౌతోంది .
నిశ్శబ్ద బందీలో.. నీ ఊహల ఊసులలో కాలం కరిగిపోతోంది , కనిపించని లోకమేదో కలలో కదిలిపోతోంది ...నీ జతలో నేను ఇంకి పొతూనే ఉన్నా నేనేమిటో అర్ధం కాక.
చూశావా...
భారమైన దూరాల మధ్య బందీలుగా మిగిలిపోయాం. అవసరాల జీవితంలో ఖైదీలుగా సాగిపొతున్నాం .మన ప్రమేయం లేని ఎడబాటు కాలం మౌన సందేశమై కరిగిపోతోంది సమయం .
తనువుల దూరాన్ని తలచుకుంటూ స్పర్శల సాంగత్యం కావాలని మనసుల పెనవేసుకున్న మౌనమే మాటాడు కుంటొంది.జ్ఞాపకాల పుటలు విప్పుకుంటూ...అనుభూతుల అందాలు పంచుకుంటూ ..మనుగడకై పోరాటంలో జీవనయానం తప్పనిసరి.
దూరాన్ని నిందిస్తూనే వున్నా...దగ్గరను దాసోహం కమ్మంటూ...
నిరీక్షణకు నిట్టూర్పుల కానుకిస్తూనే వున్నా. ఎదురు చూపుకు కన్నీళ్ళను బహుమతినిస్తూ.....
వచ్చి వెళ్ళి పొతావు హడావిడిగానే... ఉన్న కాసింత సమయంలోనే మమతల సంతకాలు నింపేసుకుని. రాబోయే క్షణాలకు తాయిలాలు దాచేసుకుని నిశ్శబ్ద ప్రయాణం నాదౌతుంది. మళ్ళీ మామూలే దూరాన్ని మోసుకుంటూ దగ్గరకై వేచి చూస్తూ ...
నిత్యమైన ఎదురుచూపుల్లో ...
అంతులేని అగాధాలెన్నో
అద్దాన్నికూడా ఏమార్చు కుంటోంది మనసు నీ కోసమే ...
నీ కనుపాపల్లో అర్థాలు ఆస్వాదించు కోవాలని ఆరాటపడుతూ
కాలాన్ని కసురుతూనే ఉన్నా లోకం మనదై కరిగిపోవాలని.
రెప్పలు కలవని రాత్రులే అన్నీ
వలపు సంతకాలతో నిండిన మాధుర్యపు జ్ఞాపకాలు లెక్కించు కుంటూ...
రేపటికి ఊతమవ్వాలని నీ ధ్యాసలోనే నన్ను నేను నడిపించుకుంటున్నా మన ఆశల వారధి కోసమే
అక్షరాల్లొ ప్రస్ఫుటించే ఆంతర్యాలెన్నో కదూ నువ్వై నాలో కరిగిపోతూ నెనై నీలో ఇమిడిపొతూ ...
ఎంతైనా అందంగా వుంది సుమా నీ లేఖ నన్నే నీ దగ్గరగా చూసుకుంటున్నట్లుగా నేనున్నట్లుగా.అక్షరాలు చేసే అద్భుతాలు కదూ. మనంగా ప్రకటించుకునే ఆనందాలు కదూ..
మనసామ్రాజ్యాన్ని నిర్మించుకుని మనమై కలసిపొదాం ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకుంటూ .అంతవరకు
ఇలా కాసిన్ని వాక్యాలు నీ కోసం ప్రేమికుల రోజున అక్షరమై స్పర్శించుకుంటూ...
నీ... నేను
Image may contain: drawing
కంటితడుల రుచితెలియని మనసెక్కడ దొరుకుతుంది ||
ఙ్ఞాపకాన్ని నిలువరించు శక్తెక్కడ దొరుకుతుంది ||

సమీరమే ఓదార్చెను ఏకాంతపు వేదననే
మౌనంతో మాటాడని హృదిఎక్కడ దొరుకుతుంది ||

వెలుతురెంత పరిచున్నా చీకటులే మస్తకంలో
మదిఓడిన తేజానికి తోవెక్కడ దొరుకుతుంది ||

వెన్నెలలో నడవాలని తిమిరాలను వెలివేస్తూ
నీడలనే చెరిపేసే వెలుగెక్కడ దొరుకుతుంది ||

తలపుల్లో తడబాటులు రెప్పచాటు దృశ్యాలూ
తడితరగలు తుడిచేసే మమతెక్కడ దొరుకుతుంది ||

నిన్నటిదే ఆవేదన నా ముందర ప్రశ్నేగా
గుండెగదిలొ అనుభూతికి చోటెక్కడ దొరుకుంది ||

పెదవులపై నిట్టూర్పులు చెమరించిన చెక్కిళ్ళే
అలజడులను దాచేసే తెరఎక్కడ దొరుకుతుంది ||

కలవరాలు కడిగేసే స్వప్నాలే కావాలి
చింతలన్ని తొలగించే నిదురెక్కడ దొరుకుతుంది ||

మౌనవాణి పదనిధులే సవరించని దుఃఖాలు
రగులుతున్న గాయాలకు మరుపెక్కడ దొరుకుతుంది ||
.......వాణి,


...హోం మేకర్......


( ఓ మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబించే ప్రయత్నం)
పెళ్ళి చేసేసి పెద్దోళ్ళు
మూడుముళ్ళేంచేసుకుని నేను
ఏడడుగులు నడిపించుకుని నువ్వు
మనదీ అనుకుంటూ ఒక జీవితం మొదలు

ఉద్యోగంలో తలమునకలై నువ్వు
సంసారంలో సర్ధుబాట్లు చేసుకుంటూ నేను
కొన్ని సంవర్సరాలలో ఎన్నో మార్పులు
బాధ్యతలు బంధాలు పిల్లలు వాళ్ళ చదువులు
సరదాలు కొన్నే అవసరాలే అన్నీ
శ్రమ ఇద్దరిదీనూ
నీ షిఫ్టు డ్యూటీలేమోగానీ
కంపెనీ వెట్టి చాకిరీకి నువ్వు
ఇంటిపనికి నేనూ బానిసలమై పోయాం
నిద్దుర పోయేది మూడునాలుగు గంటలే
అప్పుడూ రేపటి రోజు చర్చలే నిద్దురలోనూ
పొద్దుటే ఐదుకి నువ్వెళితే
ఏడుకు పిల్లల్ని పంపాలి
మధ్యలో ఎన్నో మంచినీళ్ళని
బాక్సులు బ్యాగులు సర్ధడాలు
పిల్లలకి స్నానాలు జడలు వగైరాలు
టిఫెన్ మాట దేవుడెరుగు
అన్నం కంచంలో పెట్టుకున్నా గొంతు దిగదు
వెళ్ళే టైమేగాని నీవొచ్చేదెపుడో తెలీదు
బాస్ ఆపని చెప్పడనో మరెక్కడకో వెళ్ళాల్సివచ్చిందనో
అవసరాల కారణాలెన్నో
పిల్లలు వాళ్ళ హోం వర్కులు
వగైరా వగైరా చెప్పుకోలేనివే
చిన్న చిన్న పనులు ఓపికకు పరీక్ష పెడుతూ
వారం మధ్యలో ఏబ్యాంకు పనో మార్కెట్ అనో
యాడ్ ఆన్ వర్క్సు
నీ శ్రమను నేను గుర్తిస్తాను రాగానే
చిరునవ్వుతో నీళ్ళగ్లాసు అందిస్తూ
నే వెళ్ళాక ఏం పని అనేవాడివిగా
ఇవన్నీ ఎలా అవుతున్నయో అర్ధం కాదు కదా
గుర్తింపు మాత్రం శూన్యం
హోం మేకర్ నే
అనుక్షణం అలసిపోతున్న సగటు మహిళనే...!!
........వాణి
Image may contain: 1 person
నీ ప్రేమల సంద్రంలో ఈదుతూనె ఉన్నాను ||
మనసుతోన పోరాటం సలుపుతూనె ఉన్నాను ||

ఎడబాటుల వేదనతో వేగలేక పోతున్నా
చీకటైన నీ జాడలు వెతుకుతూనె ఉన్నాను ||

శూన్యంలో నీ రూపం నా కోసం వెతికిందా
నీ నీడే తెరచాపగ దాగుతూనె ఉన్నాను ||

ఉప్పెనలో ఊహల్లో ఉలికిపాటు ధ్యాసల్లో
నీవే నా లోకంగా సాగుతూనె ఉన్నాను ||

మధురవాణి మౌనంగా అనుభూతులు రాల్చిందీ
ఆలాపన ఆలోచన చిలుకుతూనె ఉన్నాను ||

నిశ్చలమై నీ చూపులు నిశ్శబ్దాలు కురిశాయి
నీవంతా నేనౌతూ మిగులుతూనె ఉన్నాను ||
........వాణి,
No automatic alt text available.
గుండెలోతున గుబురు కట్టిన చింత ఏమిటొ తెలియలేదు ||
కనుల ముంగిట సంచరించే చీకటేమిటొ తెలియలేదు ||
.
భావమైనది భారమంతా బ్రతుకుగీతను దాటలేక
రాగమద్దిన గేయమే అది గుబులు ఏమిటొ తెలియలేదు ||

.
చిక్కుముడులే జీవయాత్రలొ సుఖమైనా దుఃఖమైనా
మరణమే ఒక విషాదమైతే మర్మమేమిటొ తెలియలేదు ||
.
నిశలుఎప్పుడు నిష్ర్కమించవు కాంతి బాటను వెతుకుతాయి
తిమిరమెంతటి సహనమైనదొ బలిమి ఏమిటొ తెలియలేదు ||
.
కాలమహిమలు లెక్కలేనివి కదంత్రొక్కును విచిత్రంగా
ఉప్పెనొచ్చిన క్షణములాగవు గమ్యమేమిటొ తెలియలేదు ||
.
మౌనవాణిది మనసుయుద్ధం - సాగిపోయే జీవలాస్యం
ముసురుకున్నవి ఙ్ఞాపకాలే - లోతు ఏమిటొ తెలియలేదు ||
.......వాణి,

Image may contain: one or more people, twilight, sky, nature and outdoor
వేకువతెర తీయాలని కిరణాలకు - ఎలా తెలుసు ?
మలిపొద్దుకు మార్గమనీ - అరుణాలకు ఎలాతెలుసు ?

బందీగా మనసున్నా - తోడున్నది ఏకాంతమె
కన్నీళ్ళే కావ్యమనీ - కవనాలకు ఎలాతెలుసు ?

తడుముతోంది మానసమే - రేయంతా శూన్యంగా
మది చిలికే అలజడనీ - భావాలకు ఎలాతెలుసు ?

పవళించని రాత్రిలోన - పలుకులెన్ని దాగాయో
పులకింతల మెరుపులనీ - మురిపాలకు ఎలా తెలుసు ?

నడిచొచ్చును దుఃఖమనీ - గమనించదు జీవితమే
అనుభూతులె సంపదనీ - గమనాలకు ఎలాతెలుసు ?

చితికివున్న హృదయానికి - ఆత్మీయత పంచివ్వూ
చెలిమంటే కలిమియనీ - గాయాలకు ఎలా తెలుసు ?

మౌనవాణి మది ఘర్షణ - మరపురాని ఙ్ఞాపకమే
అక్షరమే మాతృకనీ - దుఃఖాలకు ఎలా తెలుసు ?
.......వాణి,

కరిగిపోయిన కలలరూపం - చెంతచేరిన ఎంతహాయీ ||
మూగబోయిన మధురవాణియ - పెదవివిప్పిన ఎంతహాయీ ||

ఙ్ఞాపకాలే నిధులుఅయితే - గాయఘటనలు మరువలేమే
వెంటవచ్చే వేదనంతా - చెరిగిపోయిన ఎంతహాయి||

కాలమెంతటి కఠినమైనదొ - పసితనాలకు శిక్షవేస్తూ
చిలిపినవ్వులు మాలగుచ్చుతు - కానుకిచ్చిన ఎంతహాయీ ||

నిన్నమొన్నలు మసకబారక - మనసులోనే నడుస్తున్నవి
చేదునింపిన చరితలన్నీ - చెరిగిపోయిన ఎంతహాయీ ||

పలకరింపులు జ్ఞాపకాలే - బంధాలన్ని ప్రశ్నలైనవి
గమనమంతా గతములోనే - సంచరించిన ఎంతహాయీ ||

రాలుతున్నవి అక్షరాలే - మౌనమైనవి భావఝరులే
మూగబోయిన ఆశలన్నీ - మురిసిపోయిన ఎంతహాయీ ||

చింతలన్నీ విసుగుచెెందితె - చరమగీతం పాడమంటిని
నవ్వులోకం హత్తుకుంటూ - స్వాగతించిన ఎంతహాయీ ||
....వాణి,


గగనాన చేరిన నీ ఆత్మ రూపం నిశ్వాస హాసం పరుస్తు ఉంది ||
చుక్కలతొ చెలిమిగ ఓ కిరణ బాష్పం ఓదార్పు నవ్వులు రాలుస్తు ఉంది ||

కన్నీటి కొలిమిలొ కలతెంత కురిసిన గుండెల్లొ రగిలే తపనాగి పోదెం
చెక్కిళ్ళ చెలిమితొ దుఃఖాల భారం విధిలేని మరకను పరుస్తు ఉంది ||

నిదురించలేని రేయంత మోస్తూ మదిలోన గాయం శూన్యంలొ చూపు
ఓ నవ్వు శబ్దం నా గుండె తడిలో కల చెదిరిపోతూ కలుస్తు ఉంది ||

అరుదైన అలకలు తీరైన బాధలే మిణుకంత మెరుపును నే గెలవదేం
చేయొదలిపోతు మనసంతగెలిచి ఆత్మీయభారం కురుస్తు ఉంది ||

ఉలికులికి పడుతూ మేనంత అలజడి నిన్నల్లో నిలిచిన నీ స్పర్శ తాకిడి
కొండంత అండ చెదిరింది రాలుతూ పెదవిరుపు తడిని విరుస్తు ఉంది ||

నిశీధి ప్రళయం వెలుగోడిపోతూ పవళింపు జాడలు వెతుకుతువుంది
ఓ మధురవాణీ తను మూగబోతూ తిమిరంపు తడిలో తడుస్తు ఉంది ||
.
......వాణి కొరటమద్ది

Monday, April 16, 2018

Image may contain: drawing
మనసును మబ్బుగ మలచిన గాయం - ఆరిపోదుగా ఎన్నటికీ ||
కదిలే కాలం అనుమతడుగుతూ - ఆగిపోదుగా ఎన్నటికీ ||
జీవికి మరణం తనువుకు ముగింపు - సృష్టిలొదాగిన రహస్యమే
వడలిన పుష్పం ఉనికిచాటుతూ - మిగిలిపోదుగా ఎన్నటికీ ||
బ్రతుకు యాత్రలో బోధనలెన్నో - ఆశకు అర్ధం చెపుతాయి
ప్రయత్నమాపని అలనేేచూడూ - ఓడిపోదుగా ఎన్నటికీ ||
వెలుగులతీరం ముందేవున్నది - నిలవక అడుగులు సాగనివ్వు
చీకటిదెపుడూ చిద్విలాసమే - అలసిపోదుగా ఎన్నటికీ ||
ఓరిమి గుండెను తడమక పోతే - సాధనకర్ధం ఉంటుందా ?
ఙ్ఞాపకమే ఒక గాయం అయితే - చెరిగి పోదుగా ఎన్నటికీ ||
మౌనం జతగా మసలే వాణికి - అంతరంగమే ప్రపంచమా ?
చిలికే ఎదలో తడిమే భావన - వీడిపోదుగా ఎన్నటికీ ||
......వాణి,

యాంత్రికం ....


Image may contain: phone and screen
అరచేతి ప్రపంచంలో అరుదైన ఆద్భుతాలెన్నో
ఆత్మీయత మరిచిన స్పర్శలమధ్య
సందేశంలోనే స్పందన చిరునవ్వు తొడుక్కుంటుంది
అర్ధరాత్రే మొదలైన గుడ్ మార్నింగ్ లు రేపటిలోకి తొంగి చూశాకే నిద్రకు ఉపక్రమిస్తాయి
సూర్యోదయాన్ని ఆలస్యంగా ఆహ్వానిస్తూ
బిజీగా గజి బిజిగా
బ్రతుకు యుద్ధానికి సన్నద్ధమౌతుంది సమాజం
ఇంటిలోని భావాలన్నీ చరవాణితో నిక్షిప్తమయ్యాక
నిర్లిప్తంగానే కాలం నిష్క్రమిస్తుంది
మురిసిపోతూ సెల్ఫీగానో
దినచర్యలన్నీ స్టేటస్సులుగానో
జ్నాపకాలన్నీ అంతర్జాలపు రంగుల్లోనో
నిశ్శబ్ద చిత్రాలై
ఇష్టంగానూ మెచ్చుకోలు స్పందనలోనో
సంతోషాన్ని పులుముకుంటూ ఉంటాయి
మారిన మనుషులు
మరుగైన అనుబంధాలు
ఆధునికత అలుముకున్న
భావాజాలంలో సాయంకూడా
స్వార్ధమై స్వచ్చతను కోల్పోతోంది
అవసరమైనదే సాంకేతికత
సమస్తమై పోయిందిపుడు...!!
.......వాణి, 
Image may contain: one or more people, people dancing, sky, ocean, outdoor, nature and water
వేదనంత వెలుతురుగా - మారుతూనె ఉండాలి ||
సంకల్పమె సమరంగా - సాగుతూనె ఉండాలి ||
చిట్లిపడే కన్నీళ్ళవి - చిందిపడెను భావంగా
తడిజాడలు ఎదలోతున - చెరుగుతూనె ఉండాలి ||
రెప్పలెపుడు తడిదుప్పటి - కప్పుకునే ఉండవులే
నులివెచ్చటి ఉదయకాంతి - చేరుతూనె ఉండాలి ||
కనుపాపను తాకలేని - కలలెన్నో మెలుకువలో
చిరునవ్వులు బాష్పాలుగ - రాలుతూనె ఉండాలి ||
అనుబంధం అనుభూతిలొ - పదిలమై పోనుందా
మమతస్పర్శ మాధుర్యం - పంచుతూనె ఉండాలి
కఠినమైన క్షణమైనా - కరిగిపోక నిలువదులే
కాలమెపుడు సౌమ్యంగా - గడుపుతూనె ఉండాలి ||
మౌనవాణి పోరాటం - నిశీధితో నిరంతరం
చీకటిపై వెలుగురంగు - అద్దుతూనే ఉండాలి ||
......వాణి,



వెలుగు పూల వర్షంలో - తడవాలని అనుకున్నా ||
కనుపాపకు కాంతులనె - తొడగాలని అనుకున్నా ||

నిశీధులో నిట్టూర్పులొ- ఏమైనా ఎదురైనా
అడుగులన్ని వెలుతురులో- సాగాలని అనుకున్నా ||

అంతులేని ఆకాశపు - వీధులలో విహరిస్తూ
వెన్నెలగా నేనంతా - మెరవాలని అనుకున్నా ||

నలుపైతే నేమైనది కనులలోన అందాన్నే
రెప్పలపై కాటుకగా కరగాలని అనుకున్నా ||

దిశలన్నీ తారాడితి - నీ ఉనికే తెలియలేదు
వేలుపునే వేదనగా - వేడాలని అనుకున్నా ||

ధ్యాసంతా నీపైననే - జరపలేను కాలాన్నీ
దుఃఖానికి పరదాలను - కప్పాలని అనుకున్నా ||

మౌనవాణి మానసమే - అంతులేని కలవరమే
కన్నీళ్ళను కావ్యంగా - మలచాలని అనుకున్నా ||

స్వర్గంలో నీ వుంటే - అందలేని ఆరాటం
కరిగిపోని కలలాగా - మిగలాలని అనుకున్నా ||

.......వాణి,
తప్పిపోయి నీ జాడలు వెతుకుతూనె ఉన్నాను ||
ఎదురుచూపు కన్నీళ్ళను చల్లుతూనె ఉన్నాను ||

కంటిమీద గుండెబాధ చెరపలేని గాయమై
జ్ఞాపకాల మరకలన్ని తడుముతూనె ఉన్నాను ||

మదిలోతుల అలజడులే రెప్పలపై చప్పుడులె
చీకటిలో అక్షరాలు చెక్కుతూనె ఉన్నాను ||

మౌనమంత కవనమౌతు వికసించే కెరటమై
తడుపుతున్న కాగితాన్ని నిమురుతూనె ఉన్నాను ||

కనులకడలి పొంగుతూ కాంతి గీతి పాడనా
మదిఘోషకి మరపుమందు పులుముతూనె ఉన్నాను ||

చెమరించే మువ్వలన్ని చెక్కిలిపై చిట్లిపడ
చెంపలపై చారికలను చెరుపుతూనె ఉన్నాను ||

గుండెల్లో దిగులుముళ్ళు గుచ్చుతున్న ఆనవాళ్ళు
మౌనంతో అనునయాలు అద్దుతూనె ఉన్నాను ||

కవిత్వమే ప్రియమవుతు అక్షరమై ప్రవహిస్తు
భావంలో మాలికగా ఒదుగుతూనె ఉన్నాను ||

విసుక్కునే హృదయంతొ ఒంటరైన చూపులలొ
నటియించే నవ్వులనే తొడుగుతూనె ఉన్నాను ||

........వాణి,

No automatic alt text available.
అంతరంగములొ ఆవేదనగా సగం సగంగా సాగుతున్నాను ||
విశ్రమించదేం భావతరంగం కలం కలంగా కరుగుతున్నాను ||

ఉనికినితాకని కలలప్రపంచం తీరని ఆశగ మిగిలిపోయెనా?
అడుగుఅడుగులో ధైర్యంనాటుతు కణం కణంగా కదులుతున్నాను ||

అంతేలేనీ వెలుగుచీకటులు జీవనదృశ్యం చూపించాయీ
నడిచేతోవలొ వింతలుఎన్నో భయం భయంగా బ్రతుకుతున్నాను ||

కనిపించదులే కరిగినకాలం గతమైపోయెను ఙ్ఞాపకమౌతూ
గోడమీదనే మిగిలిన బంధం ఎడం ఎడంగా మిగులుతున్నాను ||

జీవనవేదిక నిండావేదన హాసం ఙ్ఞాపక మైపోయిందీ
నిన్నటిలోనే మనసు నిలచెనే గతం గతంగా గడుపుతున్నాను ||

చెమ్మగిల్లెలే తమసాతీరం చూపుకునోచని వెన్నెలకిరణం
మనసునుదోచిన మౌనప్రపంచం ప్రియం ప్రియంగా మసలుతున్నాను ||
....వాణి,
 http://picosong.com/GrRb
చరితంతా తవ్విచూడ ఆరిపోని కన్నీళ్ళే ||
బ్రతుకంతా తడిమిచూడు ఆగిపోని కన్నీళ్ళే ||
అందమైన రూపానికి మెచ్చుకోలు పరిచయం
కదులుతున్న శిలవేగా కరిగిపోని కన్నీళ్ళే ||
అనాదిగా ఆడతనం అవసరాల సావాసం
చీకటిలో దాచేసే చెరిగిపోని కన్నీళ్ళే ||
చెమటచుక్క కంటిచుక్క రాలిపడే జీవయాత్ర
కంటకాల కొలిమిలోన అరిగిపోని కన్నీళ్ళే ||
ఆకాశం నీదంటూ అవనివంటె నువ్వంటూ
తొడుగుతున్న కిరీటాలు ఓడిపోని కన్నీళ్ళే ||
అమ్మవంటి కమ్మదనం అతివకెంత అదృష్టం
మురిపాలతొ మురిసిపోతు అలసిపోని కన్నీళ్ళే ||
బంధాలను పెనవేసిన బాధ్యతలకు బందీగా
వినిపించని వాణి నీది వీడిపోని కన్నీళ్ళే ||
.....వాణి,
No automatic alt text available.
చీకటులను చెరిపలేని మెరుపును చూపించలేను ||
కన్నీళ్ళను రుచిచూడని మనసును చూపించలేను ||
అమావాస్య రాత్రిలోన అద్దమెలా చూడాలీ
నిశీధిలో చందమామ పరుగును చూపించలేను ||
ఊహించని గాయాలకు ఊతమెలా వెతకాలీ
నలుగుతున్న వదనంలో నగవును చూపించలేను
అడుగు కదిపి సాగాలి దూరాలను చేరాలీ
నిలబడితే గమ్యానికి నెలవును చూపించలేను ||
చుట్టుకున్న తిమిరాలకు తడబాటులు తప్పలేదు
చమురులేని ప్రమిదలోన వెలుగును చూపించలేను ||
కాలానికి సంకెళ్ళను వేయుటెలా సాధ్యమూ
మరుజన్మల పుట్టుకలో రూపును చూపించలేను ||
.....వాణి,

వెన్నెలలన్నీ కలలే అయితే - చీకటిగానే మిగిలానా ?
వెతికేకన్నులు అలసిపోనివి - వేకువగానే మిగిలానా ?
మయూరలాస్యం మౌనమైనదా ? నిశ్శబ్దయుద్ధం నాదైతే
చిగురులు తొడగని చిరునవ్వులతో- ఓరిమిగానే మిగిలానా ?
శ్వాసను మరిచెను గమనాలన్నీ - గమ్యం గాయం అయ్యిందీ
బాటలు అన్నీ తడబాటైతే - నిరాశగానే మిగిలానా ?
దరహాసాలే దారితప్పుతూ - దాగుడుమూతలు ఆడాయి
తప్పటడుగులే తప్పిపోయెనా - వేదనగానే మిగిలానా ?
ఉదయకాంతులు ఉరకలు వేస్తూ - ఊహకు ఊపిరి పోశాయి
చింతతొ చెలిమిని చెరపలేనులే - భావనగానే మిగిలానా ?
మౌనవాణిగా హృదయతరంగం - ప్రేమగతాకే తీరాన్నే
తలపునుతడుముతు మనసును చిలికే - కెరటంగానే మిగిలానా ?
.....వాణి,

.......చీకటిలో చెమటచుక్క ఆమె.....


అలసిన రాత్రి ఆదమరచిన వేళ
తను మెలుకువై రహదారిని హత్తుకుంటుంది

పగలంతా స్వచ్ఛ భారతమంటూ పతాకాలు చేతబూని వాగ్దానాలు ముగిసిపోయాక
స్వచ్ఛతకు శ్రీకారం చుడుతూ చెమట చుక్కలతో వీధులన్నీ శుద్ది చేస్తుంది
నొప్పిపడే అవయవాలను మోసుకుంటూ అర్ధరాత్రి
రోడ్లపై రెక్కలకు చీపుర్లను తొడుకుంటుంది ఆమె
తెల్లారే దాకా తుడిచే చేతులను నొక్కుకుంటూ
తనవారి ఆకలికై తాపత్రయపడుతూ తల్లడిల్లుతుంది
తాగుబోతువాహనాలను తప్పించుకుంటూ
అర్ధం కాని అహంకారులను నిట్టూర్పుతో సాగనంపుతూ ...
ఆమె రహదారుల మధ్య వ్యాక్యూం క్లీనరై సంచరిస్తుంది
శ్రమించిన బాటను జోలపాటై నిమురుతూ
రేపటికి సమాయత్తం చేస్తుంది ఆమె...
తుడిచిన దారులకు చిరునవ్వు తొడుగువేసి
చీకటిలోనే నిష్క్రమిస్తుంది ...
బ్రతుకుబాటకు వెలుతురు రంగు అద్దుకోవాలని...!!
.......వాణి,

వేసారిన అంతరంగం....

Image may contain: one or more people










































నిన్నటి కలలలోనే నువ్వింకా సంచరిస్తున్నావని
నా మీద అసహ్యాన్ని ప్రకటించినపుడల్లా
ఆర్ద్రమైన అశ్రువునౌతానని ఎలా చెప్పను ?

వేకువ చిరునవ్వులు నాకోసం చిందించకున్నా
మాజీలకు రాజీపడుతూ సంక్షిప్త సందేశమై ఎగిరి పోతూనే వుంటుందని తెలిసినపుడు
మనసు నిట్టూర్పు కన్నీళ్ళను ఒలుకుతోందని ఎలా చెప్పను ?
నీ గాయాలకు ఊతం నేనైనప్పుడు
నీ నొప్పి నాదై తల్లడిల్లినపుడు
అవసరానికి నేనని తెలుసుకున్నపుడు
నిలదీయలేని అసహాయత నాదని ఎలా చెప్పను ?
ఓడిన ఆశయాలేవీ నీ సమక్షంలో సేదతీరలేదు
అవసరాల అదృష్టాలన్నీ కష్టంగానే సర్దుకున్నాయి
చీకటికీ చిరునవ్వుకీ మధ్య సవాలక్షసార్లు సంధి చేశానని ఎలా చెప్పను ?
కోపం నీ హక్కనుకుంటావు
సహనం నాకు శిక్షౌతుందపుడు
విసుగు నీ సొంతమైనపుడు
నేను వివక్షనెదుర్కొంటాను ?
తడిమనసు భావాలన్నీ
కలం కన్నీటి చుక్కలతో రచిస్తున్నా
అంతరంగ తరంగాలన్నీ
మౌనంపు బంధకాలయ్యాయి
మనసు నొప్పిని కప్పి పుచ్చుకుంటూ
గాయాలను అక్షరాలలో వ్యక్తపరుచుకుంటూ
గేలి చేసే గమనాలను సాగనంపుతూ
నిశ్శబ్ద బందీగా నిస్సహాయినౌతున్నా....
vani
నింగికురవని నీటితుంపర మబ్బుతునకగ మారిపోనా ॥
అవనితడుపుతు వరములిచ్చే మేఘమాలగ మారిపోనా ॥

భూమితల్లికి గుండెఎండగ పగిలిపొయెను బీడువారుతు
ఆర్తి తీరగ తడిసిమురిసే మమతవానగ మారిపోనా ॥

చెట్టు పుట్టలు జీవజాతులు దు:ఖనీటిని తాగుతుంటే
తరులవిరులకు సిరులునింపే చెలిమి తూరగ మారిపోనా ॥

ప్రకృతిఅంతా అలుకబూనుతు ఎండమావిగ మారిపోతే
పలుకరించగ మట్టి మధురత నీటిచుక్కగ మారిపోనా ॥

తల్లడిల్లెను తరువులన్నీ గ్రీష్మతాపం ఓపలేకనె
పూలువిరియగ పుడమితల్లిపై తేనెసోనగ మారిపోనా ॥

పండుటాకులు ఎండిరాలుతు పొగిలిఏడ్చెను తేమకోసం
దప్పితీరగ ధరణిమాతకు మంచుధారగ మారిపోనా ॥

..........వాణి ,

సర్దుకుపోతూ ....
చిరునవ్వులు పెదాలపై పూయించాలని
చిరకాల చీకటిని చెరిపేయాలని
కొత్త కాంతులు కూడగట్టు కుందామని
మధురవర్ణాలలో మురిసిపోదామని
ఉగాదికై ఎదురుచూస్తున్నా..

సందడి చేసిన సందర్భాలన్నీ ఙ్ఞాపకాలేనా
నాటిలోనే మిగిలిన ఆనందాలు
బ్రతుకుయుద్ధంలో బందీ అవడం
నేడు నిజమేనేమో
ఊపిరికై పోరాటాలు
ఉనికి వెతుక్కునే ఆరాటాలు
కలల నావను నిర్మించడంలోనే
కడతేరి పోతోంది కాలం
వెన్నెల యాత్రకు ఎపుడు సన్నద్ధం కావాలి
క్షణాల నిరీక్షణలన్నీ
కలతను కడిగేయడంలోనే నిమగ్నమయ్యాక
కొత్త ఆశలకు చిగురులెపుడు తొడగను
ఆమనిని అడుగుతూనే వున్నా
కాసిన్ని ఆనందాలు కుమ్మరించి పొమ్మని
కోయిలమ్మా కాస్త కనిపించవమ్మా
కలవరాన్ని మరిచి కూనిరాగం తీస్తానంటూ బ్రతిమాలుతూనేవున్నా
ఉరకలు వేసిన ఉగాది
ఊహగానే పలుకరిస్తోంది
వసంతాలు వికసించాయని
ఋతువులు మారిన
ఋజువులేమీ కనిపించడం లేదు
అరుదుగా కనిపించే పచ్చదనం
ఊరవతల కెళ్ళి చూసొస్తున్నా
ఉగాది పచ్చడికై రూకలు చెల్లించి
రుచులు కొనుక్కుంటూ
షడ్రుచులను చేదుగానే ఆస్వాదిస్తున్నా
అనుబంధాలను అందమైన సందేశాలలో స్పర్శించుకుంటూ
సంగతులన్నీ మౌనంగా మింగేస్తున్నా
కొత్తగా ప్రకటించే వ్యాపార సంస్ధల ప్రతిపాదనలకై
వెతుక్కుంటూ
తన చిల్లర డబ్బులే రాబందులై ఎగరేసుకుపోతున్నా
గమనించలేని నిస్సహాయతలో
సాగిపోతోంది
సామాన్యుల ఉగాది
కాలం కదులుతూనే వుంది
అందుకే ఉగాది వచ్చింది
నిన్న ఙ్ఞాపమనుకున్నాక
రేపటికై ఎదురుచూపు తప్పడంలేదు
ఈసారి కూడా సాగిపోవాల్సిందే నా ఉగాది
సంతోషాలను సర్దుకుపోతూ...
......వాణి ,
ఊహలన్నీ వీగిపోతే - ఆశయాలే చెదిరి పోవును ||
గాయ మేఘం కమ్ముకుంటే - కలవరాలే మిగిలి పోవును ||
మనసు కురిసే మమతవర్షం - మౌనమైనది తెలియలేదు
రెప్పమూయని దుఃఖమైతే - ఙ్ఞాపకాలే అలసి పోవును ||
అంతరంగము చిత్రమైనది - పయనమాపదు విశ్రమించదు
నిదుర మరచిన శూన్యమైతే - సంకటాలే నిలిచి పోవును ||
గుండె గూటికి పండుగెప్పుడు - గురుతులన్నీ శోకమైతే
నవ్వులన్నీ నటనలైతే - విషాదాలే నలిగి పోవును ||
అలల కెంతటి తపననోకదా - తీరమంతా తడుముకుంటూ
అలుపు లేనిది సాధనైతే - ప్రయత్నాలే గెలిచి పోవును ||
బ్రతుకు చిత్రం నీదె అయినా - విధాతవేలే విచిత్రాలు
ఆశ అన్నది చెరప లేనిది - సంశయాలే వెలిగి పోవును ||
కలల నావను కదపలేనులె - మౌనవాణిది జాగరూకత
నిశల బాటలొ పరుగులైతే - సంతసాలే విరిగి పోవును ||
....వాణి,

అనంత మౌనం.....


మౌనం నాకే సొంతమనుకున్నాను
మాటలు సాంతం బందీ అయ్యాక
చీకటికి చుట్టాన్ని నేనే అనుకున్నాను
వెలుతురు వెనుకే వుండి
చుట్టుకుంటోందని తెలిసే దాకా
ఙ్ఞాపకాల తవ్వకాలలో
కనుమరుగైపోని గాథలే అన్నీ
ఇగిరిపోని కన్నీటినే నేను
కావ్య రూపమై కనపడేదాకా
మనసు సంఘర్షణలన్నీ
అక్షరాలై మొలకెత్తాక
కవిత్వ ప్రపంచం నాదయ్యింది
కాగితం కన్నీళ్ళను తుడిచే అస్ర్రమై
కలంతో చెలిమి
భావ పరిమళాలు పూయిస్తోంది
ఇప్పుడు నిశీధి కూడా
వెలుతురు పంజరంలో బందీ అవుతోంది
శిధిలమైన సంతోషాలన్నీ
చిగురించే చిరునవ్వును ఆహ్వానిస్తున్నాయి
మరుగున పడిన ఏమరపాటులన్నీ
ఆలోచనతో అడుగులు కదుపుతున్నాయి
నిశ్శబ్దాన్ని నేనేనని చెప్పాలనిపిస్తుంది
హృదయ నివేదనలన్నీ
అక్షరాలలో ప్రవహిస్తున్నాయని
అనంత మౌనాలన్నీ
భావాలలో ప్రకాశిస్తున్నాయనిపిస్తూ...!!
......వాణి,
వెలుతురింటికి దారి వెతుకుతు వెడలుతున్నది ఎందుకో ?
కలల కోరిక చీకటింటికి చేరుతున్నది ఎందుకో ?
.
ఎన్ని క్షణములు తరలి పోయెనొ లెక్కలేనిది మౌనమైతే
అనుభవాలను మాలగుచ్చితే తడుముతున్నది ఎందుకో ?

.
విశ్రమించవు కంటిరెప్పలు చూపుతీరం చేరుదాకా
గమ్యమేమిటొ అంతుచిక్కదు సలుపుతున్నది ఎందుకో ?
.
కలవలేనివి బాటలెన్నో దూరమెంతగ అలసిపోవునొ
వలసపోయెను మమతలన్నీ వడలుతున్నది ఎందుకో ?
.
పొగిలి ఏడ్చిన జ్ఞాపకాలే మౌనమైనవి మరలిపోతూ
గుండె చెరపని గుర్తు ఏమిటొ చెదురుతున్నది ఎందుకో ?
.
.......వాణి,


నీటిసుడులను మనసుమడిలో దాచుకుంటిని ఇంతకాలం ||
ఙ్ఞాననేత్రం మూసుకొంటే తడుముకుంటిని ఇంతకాలం ||

మౌనవాణియ మూగబోయెను తంత్రితెగిన వీణవోలే
నొప్పిఎంత సలుపుతున్నా ఓర్చుకుంటిని ఇంతకాలం ||

పట్టుతప్పిన క్షణాలెన్నో కనులనిండిన వెతలనీరే
చమురులేని వత్తివోలే వెలుగుతుంటిని ఇంతకాలం ||

ఆశనడపిన కాలమేదో వెనుకనిలచెను బరువుగానే
మౌనకధలను హృదయతడితొ పేర్చుకుంటిని ఇంతకాలం ||

అడుగుపెట్టిన అశ్రునీడలు నిశలునింపుతు నిలచివుండెను
ఎన్నిఅనుభవరాతలో మరి చేర్చుకుంటిని ఇంతకాలం ||

తరలిపోయెను కాలగతిలో తపనపడ్డ ఆశలెన్నో
కొత్తఉదయం కొంతకోరిక గడుపుతుంటిని ఇంతకాలం ||

భావజగతిలో పరుగుపెట్టే నడకలెన్నో నేర్చుకుంటూ
గతంనిలిపిన గాధలన్నీ కూర్చుకుంటిని ఇంతకాలం ||

.......వాణి,


నిశీధిలో వెన్నెలనై నిలవాలని ఉన్నదిలే ||
చీకటినే చిరునవ్వుతొ చెరపాలని ఉన్నదిలే ||

ఆకాశం అందలేదు ఆ అవతల ఏముందో
అంబరాన్ని సంబరంగ చుట్టాలని ఉన్నదిలే ||

మౌనమైన బాధ నాది మధురంగా చెపుతున్నా
భారాలను భావాలలో నింపాలని ఉన్నదిలే ||

సముద్రాన్ని చూస్తున్నా అలలతోన ముచ్చటిస్తు
కెరటాలకు చిరునామా వెతకాలని ఉన్నదిలే ||

అనుభవాలు ఎన్నెన్నో రాలిపడిన నిన్నల్లో
అనుభూతులు అద్దంలో చూడాలని ఉన్నదిలే ||

ఏమారిన కాలాలను నెమర వేసుకుంటున్నా
జ్ఞాపకాల అందాలను అందాలని ఉన్నదిలే ||

మట్టిదేగ మమకారం మరుజన్మను నిర్మిస్తూ
తుదిదాకా అనురాగం పంచాలని ఉన్నదిలే ||

ఆత్మీయత మోహమాటపు రంగు పులుము కుంటోంది
మమతతోనే బంధాలను నెగ్గాలని ఉన్నదిలే ||

శిశిరాలను వసంతాల శోభలతో నింపాలీ
కాలానికి సౌరభాలు అద్దాలని ఉన్నదిలే ||

ఆత్మలోని ఆంతర్యం అంతులేని వ్యవహారం
మౌనవాణి దుఃఖాలను చెరపాలని ఉన్నదిలే ||

కలుషితమే ప్రేమలన్ని మనషితనం మరుగౌతూ
గతమైనది ఆనందం చేదాలని ఉన్నదిలే ||

చేరలేని దూరమది బరువైనది గమ్యమేమో
మమకారపు సంకెళ్ళను వీడాలని ఉన్నదిలే ||

గమ్యాలకు చేరువైన గాథలెన్నో చూస్తున్నా
అరుదైనవి కథలెన్నో చెప్పాలని ఉన్నదిలే ||
......వాణి
పరిగెట్టే హాసాలకు గాలమెవరు వేస్తారూ ||
సలుపుతున్న వేదనలకు సంకెలెవరు వేస్తారూ ॥

ఇంకిపోయి కునుకంతా తిమిరంలో తచ్చాడెను
పీడించే రాత్రములకు పానుపెవరు వేస్తారూ॥

కరుగుతున్న క్షణాలన్ని కలవరాలు ప్రకటిస్తే
జ్ఞాపకాల ప్రతిమలకు ముసుగులెవరు వేస్తారూ ॥

గతమైనా కాలమంత గుండె నొదలి పోలేదు
ఆగిపోని అశ్రువులకు తాళమెవరు వేస్తారూ॥

తపనపడ్డ ఆశలెన్నొ దు:ఖాలను మింగాయి
నలుగుతున్న స్వప్నాలకు రంగులెవరు వేస్తారూ॥

తడిమనసుతొ తల్లడిల్లి నా వాణీ మూగబోయె
గండిపడ్డ కన్నులకు వంతెనెవరు వేస్తారూ॥
........వాణి
అడుగు అలసి పోతున్నది పయనమెలా నేస్తమా ?
మనసు మూగబోతున్నది పలుకుటెలా నేస్తమా ?
కదలలేని శిలనైతిని కన్నీటి వ్యధనైతిని
గమ్యమేమో తెలియలేదు చేరుటెలా నేస్తమా ?
నీడలోని నా రూపం కలవరపడుతున్నదేల
భారమైన ఈ మనసును వీడుటెలా నేస్తమా ?
అద్భుతాల లోకంలో అరుదైనది నా గమనం
దుఃఖాలను తిమిరంలో కలుపుటెలా నేస్తమా ?
గుండెలోతు గుబులెంతో దాచలేను దిగులంతా
శూన్యంలో స్వప్నాలను వెతుకుటెలా నేస్తమా ?
.......వాణి
గుండెకైన గాయాలను తొలగనివ్వు కాస్తయినా ||
మనసుతడికి మరుపుమందు అద్దనివ్వు కాస్తయినా ||
నిట్టూర్పుల నవ్వులన్ని నన్నుగేలి చేస్తున్నవి
వెలుగుపూల రంగుల్లో తడవనివ్వు కాస్తయినా ||
మౌనంతో పోరాటం మాటలెన్నొ చల్లాలని
నీ రాగపు లాలనలో మురవనివ్వు కాస్తయినా ||
జ్ఞాపకమై ఉలికిపడ్డ మెలిపెట్టే దృశ్యమేదొ
ఆనవాళ్ళు చీకటిలో చుట్టనివ్వు కాస్తయినా ||
విషాదాన్ని మోస్తున్నది కలలుకన్న సామ్రాజ్యం
సంతసాల కానుకలను గెలవనివ్వు కాస్తయినా ||
ఎడారంటి మనసులోన కనులుమోయు సంద్రాలు
మౌనవాణి గుండెబరువు దించనివ్వు కాస్తయినా ||
.....వాణీ వెంకట్ ,

రేపటి ఆశ......


కలలన్నీ రోడు ప్రక్క చెట్టుకు వేలాడుతూ
ఆకలి పాత్ర కన్నీటిలో ఆశలు నింపుకుని యాత్ర చేస్తూనే వుంటుంది
అమ్మలేమితనం పసితనాన్ని వెక్కిరిస్తూ
జీవన మార్గాన్ని వెతుకుతూనే వుంటుంది
గుడి మెట్లపై పుట్టుకకు ఋణం తీర్చుకుంటూ
అడిగే చేతుల్లో ఎన్ని అవ్యక్త భావాలో
బడికి అడుగులు దూరమయ్యాక
వెలుగుచూడని దిశలో బాల్యం బందీ అవుతూనే వుంటుంది
తరగతి గదిలోకి చూపులు తారాడుతూ స్నప్నిస్తూనే వుంటాయి
చంకలో చతికిలపడిన బాధ్యత
రేపటికి మార్గాన్ని వెతుక్కోమంటూ పయనమౌతుంది
బ్రతుకు దశను శోధించుకుంటూ..!!
....వాణి వెంకట్ ,
ఊపిరాగి పోతే నా ఉనికైనా ఉండనీ ||
గమనమాగి పోతే ఓ గెలుపైనా ఉండనీ ||
చీకటికే చిరునవ్వులు కానుకగా ఇచ్చేస్తే
చెక్కిలిపై ఆ మెరుపుల మరకైనా ఉండనీ ||
కన్నీళ్ళతొ కవనాలను బంధించే ఉంచానా
కావ్యంలో నాయికగా నన్నైనా ఉండనీ ||
రెప్పలపై తడితలపులు చెరపలేక పోతున్నా
నిదురించే కనుపాపలొ నవ్వైనా ఉండనీ ||
స్వప్నాలే మెలుకువపై అలిగి వెళ్ళి పోయాయా ?
కలలలోన మురిపాలను క్షణమైనా ఉండనీ ||
నిశీధిలో మధురమైన భావంగా మిగిలానా ?
మౌనవాణి పదములలో తలపైనా ఉండనీ ||
......వాణి,
మనసంతా నీ రూపే తలుస్తోంది ఎందుకనీ ||
మాధుర్యపు భావనతో నిండుతోంది ఎందుకనీ ||

తడియారని కురులతోన చిరుగాలుల ముచ్చట్లూ
చూపుతాకి చిరునగవే మురుస్తోంది ఎందుకనీ ||

ఎదురుచూపు అలసటలో నిట్టూర్పులు భారమాయె
దూరాలను కనుపాపే వెతుకుతోంది ఎందుకనీ ||

పొద్దువాలి పోతున్నది రేయి పలుకరిస్తున్నది
ఎదలోతున ఆరాటం తడుముతోంది ఎందుకనీ ||

అందమైన ఆశలతో రెప్ప వాలి పోతున్నది
హృదయభాష వెన్నెలకే తెలుపుతోంది ఎందుకనీ ||

వడలుతున్న ఊహలలో ఉనికి మరచి పోతున్నా
మధురవాణి గుండెల్లో మిగులుతోంది ఎందుకనీ ||

......వాణి



దారంతా వెలుగు పూలు పరుచుకుంటు వెళుతున్నా ||
మమకారపు సుగంధాలు పంచుకుంటు వెళుతున్నా ||

చీకటి నా వెనుకగనే ఓడిపోయి నిలిచిందీ
సంబరాల అనుభూతులు నింపుకుంటు వెళుతున్నా ||

పచ్చనైన ప్రకృతంతా హాసాలను ఒంపుతోంది
చిరునవ్వుల సమీరాలు హత్తుకుంటు వెళుతున్నా ||

నా ముందరి బాటల్లో తోరణాల సందడులే
ఆహ్లాదపు వర్ణాలలో తడుచుకుంటు వెళుతున్నా ||

చూపులతో ఆహ్వానం చెపుతున్నా అందరికీ
మాధుర్యం గుండెల్లో మోసుకుంటు వెళుతున్నా ||
......వాణి


ఎదురుచూపుల ఎండమావులు ఏలుతుంటిని ప్రియతమా ||
పదిలఘడియలు పరిహసించగ వేగుతుంటిని ప్రియతమా ||
.
అందమైనవి ఆశలెన్నో ఓడిపోతూ వెక్కిరించెను
క్షణములన్నీ భారమౌతూ గడుపుతుంటిని ప్రియతమా ||
.
నిన్నమొన్నల కాంక్షలన్నీ విరహవీధిని గడిపినాయట
కరిగిపోయిన ఘడియలెన్నో కూర్చుతుంటిని ప్రియతమా ||
.
ప్రణయగీతం పాడుుకున్నది కోయిలెంతో తీయగాకే
విరహవేదన భారమెంతో తెలుసుకుంటిని ప్రియతమా ||
.
కోరుకున్నది రేయిఎంతో మధురకలహము ఆడుదామని
తియ్యతియ్యని ఊహలెన్నోతడుముకుంటిని ప్రియతమా ||
.
తల్లడిల్లిన నిరీక్షణలే గడపమోసెను తపనలెన్నో
మౌనవాణిగ సహనమంతా కూర్చుకుంటిని ప్రియతమా ||
.....వాణి ,

రాలినపూలు...


రేయంతా రెక్కలు విప్పుకుంటూ
ఉదయాలకి ఊపిరద్దుతావు
సొబగులద్ది కొమ్మకు అందాన్ని ఆపాదిస్తూ
ఆహ్లదం , పరిమళంతో ఉదయాన్నే విచ్చుకుంటూ
భానుడికి స్వాగతం పలికాక
ఏ దేవుని పాదల క్రిందనో పూజా పుష్పంగానో
మాలలో ఇమిడిపోయి ఆ భగవంవంతుని హృదయంపైనో
అలంకారమై పూజలందుకుంటావో
వికసించిన జన్మను సార్దకం చేసుకుంటావు
ఒక్కరోజు ఆయుస్సు నీదైనా
ఎందరి జీవితాల్లో సందడీ చేస్తావో
శుభానికో అశుభానికో
ఆహ్వానానికీ వీడ్కోలుకీ
పెళ్ళి పేరంటానికీ
రంగులమయమైన ప్రకృతిలో
నువ్వో అద్భుతమైన ఆనందానివి
రాలుతూ మరో పువ్వునూ స్వాగతిస్తావు
వడలుతూ మరో సుమ పరిమళానికి వన్నె తెస్తావు
ఎన్ని జీవన యాత్రలకో నువ్వో ఆదర్శానివి
వేదనతో వేలాడే బ్రతుకులకు నువ్వో ప్రతిబింబానివి
జన్మను పరిమళిస్తూనే ముగించమంటావు
రేపటికి కొత్త సొయగాలద్దుకుంటూ సాగిపొమ్మంటావు
రాలిపోయిన క్షణాలన్నీ
వేకువలో జ్ఞాపకాల పుష్పాలై పలుకరిస్తూనే వుంటాయి
అందమైన చిరునవ్వులా
చీకటిని చెరిపేసే కాంతి సుగంధాన్ని పంచే సృష్టి రహస్యం పువ్వు ...!!
.........వాణి కొరటమద్ది
చీకటి ఛాయలు లేకే పోతే రంగులు మారే రోజే ఉండదు ||
వెలుతురు ఉనికే తెలియక పోతే వేకువ కర్ధం తెలిసే ఉండదు ||
శూన్యంతోనే స్నేహం అయితే మౌనం భాష్యం పలుకును నిజమే
మనసుకు గాయం తాకకపోతే గేయం గాథలు తెలిపే ఉండదు ||
ప్రకృతి దృశ్యం అందమైనదే సృష్టికి ప్రణతులు చేయ్యాలి
జీవిత చక్రం కాలం కదలిక మనుగడ నడకలు నేర్చే ఉండదు ||
ఆశయాలతో అడుగులు వేస్తే నిరాశ కసలే చోటు లేదులే
సంకల్పాలే ఊపిరి అయితే ఓటమి కెపుడూ అలుపే ఉండదు ||
ఙ్ఞాపకమంతా మధురం అయితే నిశ్శబ్దంపై నిందలెందుకు
గుర్తులలోనే సంచరించుతూ మౌనవాణికీ మరుపే ఉండదు ||
......వాణి కొరటమద్ది
చీకటెనుక వెన్నెలలే నిలిచాయని తెలిసింది ॥
గాయాలే అనుభవమై నడిచాయని తెలిసింది ॥
కునుకులేని కన్నులతో శూన్యంతో కబురులెన్నొ
వడలిపోని జ్ఞాపకాలు తడిమాయని తెలిసింది ॥
ఎదురొచ్చిన చూపులేవొ ప్రశ్నిస్తూ నిలిచాయి
చిరునవ్వుల చిరునామా వెతికాయని తెలిసింది ॥
తుదిదాకా అరిగిపోవు అలసిపోని కోరికలు
ఆశలతో ఊపిరులే నిలిచాయని తెలిసింది ॥
తడిఇంకని కంటిపాప తలపులెన్ని మోస్తుందొ
ఆనవాళ్ళు గుండెల్లో గుచ్చాయని తెలిసింది ॥
ఆశించిన ఆకాంక్షలు కనులముందు తచ్చాడెను
మౌనమైన హాసాలే మురిసాయని తెలిసింది ॥
పలుకులేని పెదవుల్లో పదనిధులే దాగున్నవి
మౌనవాణి భావాలే మెరిసాయని తెలిసింది ॥
....వాణి ,